క‌నీస ఆదాయ ప‌థ‌కం: రాహుల్ గాంధీ

SMTV Desk 2019-01-29 10:56:01  Rahul Gandhi, Indhira Gandhi, Narendra Modi, Anil Ambani, Minimum Income Scheme, AICC

న్యూ ఢిల్లీ, జనవరి 29: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఛ‌త్తీస్ గ‌ఢ్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ రాబోయే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో తాము కేంద్రంలో అధికారంలోకి వ‌స్తే… క‌నీస ఆదాయ ప‌థ‌కం అమ‌ల్లోకి తెస్తామ‌న్నారు. ఆ తరువాత ఇదే అంశాన్ని ట్విట్టర్ లో కూడా ప్రస్తావించారు.

ల‌క్షల సంఖ్య‌లో సోద‌ర సోద‌రీమ‌ణులు పేద‌రికంలో ఉంటే న‌వ్య భార‌తాన్ని నిర్మించ‌లేమ‌నీ, అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము అధికారంలోకి రాగానే పేద‌రికాన్ని నిర్మూలించేందుకు ప్ర‌తీ పేద‌వాడికీ క‌నీస ఆదాయ హామీ ఇచ్చేందుకు పార్టీ క‌ట్టుబ‌డి ఉంటుంద‌న్నారు రాహుల్ గాంధీ.

ఈ హామీపై గత రెండేళ్లుగా అధ్యయనం చేస్తున్నామన్నారు. విదేశాల్లో పేదరిక నిర్ములన కార్యక్రమాలపై అధ్యయనం చేసిన తరువాతనే ఈ పథకం తయారు చేశామన్నారు. ఈ పథకం అమ‌లుకు నిధులు స‌రిపోతాయ‌నీ, దేశంలో పెద్ద మొత్తంలో బ్యాంకుల‌కు అప్పులు ఎగ్గొట్టిన‌వారి నుంచి డ‌బ్బు వ‌సూలు చేసి, న‌ల్ల‌ధ‌నాన్ని వెలికి తీసి ఈ ప‌థ‌కం అమ‌లుకు ఖ‌ర్చు చేస్తామ‌నీ రాహుల్ పేర్కొన్నారు. మోడీ అనిల్ అంబానీ లాంటి వారికీ ఎలాంటి ప్ర‌యోజ‌నాలు చేకూర్చారో, తాము పేద‌ల‌కు ఆ త‌ర‌హా ప్ర‌యోజ‌నాలు ఇచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తామంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.

క‌నీస ఆదాయ హామీ అనేది ఏ విధంగా ఇవ్వాలనేది స్పష్టంగా చెప్పలేదుకానీ, రాబోయే ఎన్నిక‌ల్లో ఇదో పెద్ద హామీ అవుతుంద‌ని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే, ఈ ప‌థ‌కాన్ని ముందుగానే మూడు రాష్ట్రాల్లో అమ‌లు చేసి చూపిస్తామ‌ని కూడా చెబుతున్నారు.

గ‌తంలో, ఇందిరా గాంధీ కూడా గ‌రీబా హ‌టావో అంటూ వొక నినాదాన్ని అప్ప‌ట్లో తీసుకొచ్చారు. 1971 ఎన్నిక‌ల్లో ఇదే నినాదంతో సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల‌కు వెళ్లి, ఘ‌న విజ‌యం సాధించారు. అదే బాట‌లో ఆమె మ‌న‌వ‌డు రాహుల్ గాంధీ ఇప్పుడు పేద‌ల‌కు క‌నీస ఆదాయ ప‌థ‌కం అంటున్నారు. కాంగ్రెస్ పాలిత మూడు రాష్ట్రాల్లో ముందుగా అమ‌లు చేసి చూపించ‌గ‌లిగితే… ఆ ఆదాయ గ్యారంటీ ఏంట‌నే స్ప‌ష్ట‌త ప్ర‌జ‌ల‌కు ఇవ్వ‌గ‌లిగితే… లోక్ స‌భ‌ ఎన్నిక‌ల్లో ఈ హామీకి మంచి ఆద‌ర‌ణే ల‌భించొచ్చు.