రాష్ట్రాలకు ఈసీ లేఖలు

SMTV Desk 2019-01-28 17:01:59  Central Election Commission, States, Union territaries, Chief secretary, letters

న్యూ ఢిల్లీ, జనవరి 28: త్వరలో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం దృష్ఠి సారించింది. త్వరలో నిర్వహించబడే లోక్‌సభతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల సంఘం ప్రధాన అధికారులకు, ఆయా రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాసింది. పోలింగ్‌ విధులు నిర్వర్తించే ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో స్పష్టమైన సూచనలు చేసింది. అధికారులకు సొంత జిల్లాల్లో పోస్టింగులు ఇవ్వరాదని ఈసీ సూచించింది. గత నాలుగేళ్లలో వరుసగా మూడేళ్లపాటు పనిచేసిన జిల్లాల్లో ఉద్యోగులకు ఎన్నికల విధులు అప్పగించరాదని తన లేఖలో పేర్కొంది. 2019 మార్చి 31 వరకు వొకే జిల్లాలో పదవీకాలం మూడేళ్ల పూర్తవ్వనున్న ఉద్యోగులకు సదరు జిల్లాలో పోస్టింగ్‌ ఇవ్వరాదని స్పష్టంచేసింది. 2017 మే 31కి ముందు సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన జిల్లాల్లో.. డీఈవో, ఆర్వో, ఏఆర్వో, ఎస్సైలకు తిరిగి పోస్టింగ్‌లు ఇవ్వరాదని సూచించింది. 2019లో లోక్‌సభతో పాటు ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్‌, వొడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల సంఘం ఈ లేఖలు రాసింది.