వచ్చే నెలలో వైసీపీ ‘బీసీ గర్జన’..

SMTV Desk 2019-01-28 16:20:42  Jaganmohan Reddy, Chandra Babu, tdp, ycp, 2019 elections, tdp Jayaho BC, ycp BC garjana

హైదరాబాద్, జనవరి 28: తెలుగుదేశం పార్టీ నిన్న రాజమండ్రిలో నిర్వహించిన జయహో బీసీ సభను అనుసరించి వైసీపీ కూడా అదే తరహా సభను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తుంది. నిన్న జరిగిన జయహో బీసీ సమావేశంలో సీఎం చంద్రబాబు బీసీలకు పలు వరాలు ప్రకటించారు. ఈ సందర్బంగా వైసీపీ అధ్యక్షుడు జగన్ హైదరాబాద్ లో ఈరోజు బీసీ నేతలతో సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ భేటీకి బొత్స సత్యనారాయణ, జోగి రమేశ్, పార్థసారథి, జంగా కృష్ణమూర్తి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పేర్ని నాని తదితర బీసీ నేతలు హాజరయ్యారు.

బీసీ ముఖ్యనేతలతో చర్చలు జరిపిన జగన్.. వచ్చే నెల మూడోవారంలో ‘బీసీ గర్జన ను నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే వైసీపీ నియమించిన బీసీ అధ్యయన కమిటీ గత 6 నెలలుగా రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఈ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా పలు నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. ఈ గర్జన సదస్సులో చంద్రబాబు హామీలకు కౌంటర్ గా బీసీలకు పలు పథకాలను జగన్ ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం.