ప్రియాంకపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత..

SMTV Desk 2019-01-28 12:07:59  priyanka gandhi, AICC, AICC General Secretary, 2019 elections, Congress party, BJP, Khailash vijay vargiyas, sajjan singh

భోపాల్‌, జనవరి 28: జరగబోయే ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్దం నెలకొంది. కాగా నేతలు వ‍్యక్తిగతంగా దూషించుకుంటూ రచ్చకెక్కుతున్నారు. అయితే ఎన్నికల ప్రణాళికలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ.. ప్రియాంక గాంధీని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించిన విషయం తెలిసిందే. దీనిపై భాజపా నాయకులు వ్యక్తిగతంగా విమర్శలు చేయడం రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్ పార్టీలో జనాకర్షక నేతలు లేక చాక్లెట్‌ ఫేస్‌వంటి ప్రియాంకను తెరపైకి తీసుకొచ్చిందని బీజేపీ నేత ఖైలాష్‌ విజయ్‌వర్గీయాస్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ కాంగ్రెస్‌కు జనాకర్షక నేతలే లేరు. అందుకే అందమైన ముఖాలను తీసుకొచ్చి ఎన్నికల్లో ఓట్లు పొందాలని భావించింది. దీని కోసం కొందరు కరీనా కపూర్‌ను, మరికొందరు సల్మాన్‌ ఖాన్‌ను సూచించారు. కానీ కాంగ్రెస్‌ చివరకు ప్రియాంక గాంధీని తీసుకొచ్చింది అని వ్యాఖ్యానించారు. ప్రియాంక అందాన్ని చాక్లెట్‌తో పోల్చడం వివాదానికి కారణమైంది.


కాగా, ఖైలాష్‌ విజయ్‌వర్గీయాస్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మధ్యప్రదేశ్‌ మంత్రి సజ్జన్‌ సింగ్‌ వర్మ తీవ్రంగా మండిపడ్డారు. ‘భాజపాలో కూడా జనాకర్షణ నేతలు ఎవరూ లేరు.. ఆ పార్టీలోని నేతలను జనాలు కూడా గుర్తించలేరు. కాగా వారి పార్టీలో జనాకర్షక నేత వొకరే వొకరున్నారు... ఆమె నటి హేమమాలిని. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్లు పొందాలంటే హెమమాలినితో క్లాసికల్‌ డ్యాన్స్‌ చేయించాల్సిందే. ఆమె క్లాసికల్‌ డ్యాన్స్‌ అదరగొడితేనే బీజేపీకి ఓట్లు పడతాయన్నారు. దేవుడు ప్రియాంకను అందంగా పుట్టించడం ఆమె తప్పుకాదు. అందంగా ఉన్నవారిని ప్రశంసించాలి కానీ ఇలా వ్యాఖ్యానించకూడదన్నారు. ప్రియాంక పట్ల ఈ తరహా వ్యాఖ్యలతో విజయ్‌ వర్గీయాస్‌ తన గౌరవాన్ని పోగొట్టుకున్నారు. సొంత పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు అని సజ్జన్‌ ఘాటుగా బదులిచ్చాడు. దీంతో ఖైలాష్‌ తన వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చుకున్నారు. తాను ప్రియాంకను ఉద్దేశించి చాక్లెట్‌ అనే పదం వాడలేదని, బాలీవుడ్‌ నటులను ప్రస్తావిస్తూ అన్నానని పేర్కొన్నారు.