తెలంగాణ వ్యతిరేకితో కెసిఆర్ చర్చలా ?

SMTV Desk 2019-01-27 14:13:10  Ponnam Prabhakar, Kcr, Pawan Kalyan, Raj bhavan, Modi, Congress, Bjp, Trs, Janasena

హైదరాబాద్, జనవరి 27: రాజ్‌భవన్‌ వేదికగా అప్రజాస్వామిక చర్యలు చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. తెలంగాణను వ్యతిరేకించిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తో సీఎం కేసీఆర్‌ ఎలా చర్చలు జరుపుతారని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతో రాజ్‌ భవన్‌కు ఉన్న విలువను తగ్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి ఎందుకు వచ్చిందా? అని ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. కేసీఆర్‌,ప్రధాని నరేంద్ర మోదీకి ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దేశం మొత్తం ఏకకాలంలో ఎన్నికలనే నినాదం ఎత్తుకున్న మోదీ.. తెలంగాణలో మాత్రం కేసీఆర్‌ కోసమే ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు సహకరించారని ఆరోపించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ ఏర్పాటు చేసిన ఎట్‌హోం కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, ఇరు రాష్ట్రాల మంత్రులు, ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరైన విషయం తెలిసిందే.