గుంటూరు, జనవరి 27: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లేందుకు అనువుగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. నిత్యం సమావేశాలతో జోరు పెంచారు పవన్. ఈరోజు గుంటూరు జిల్లాలోని లూథరన్ పాఠశాల క్రీడామైదానంలో సాయంత్రం 5 గంటలకు ‘సమర శంఖారావం పేరుతో బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీల సాధనలో అధికార టీడీపీ, ప్రతిపక్షం వైసీపీ ల వైఫల్యాన్ని జనసేనాని ఈ సభలో ఎండగట్టనున్నారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మాదాసు గంగాధరం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, రాష్ట్ర కోఆర్డినేటర్లు మాదా రాధాకృష్ణమూర్తి, షేక్ సయ్యద్‌బాబు బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జనసేన సభకు భారీ సంఖ్యలో అభిమానులు, మద్దతుదారులు తరలివచ్చే అవకాశమున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి తొక్కిసలాటలు చోటుచేసుకోకుండా 600 మంది జనసేన వాలంటీర్లను రంగంలోకి దించారు. ఈరోజు సాయంత్రం 3 గంటలకు జనసేన పార్టీ గుంటూరు ఆఫీసును పవన్ ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 4 గంటలకల్లా సభావేదిక వద్దకు చేరుకుంటారు. చివరికి సాయంత్రం 5 గంటలకు సభ ప్రారంభం అవుతుంది.