జగన్ బిర్యానీ కధ చెప్పిన నాగబాబు..

SMTV Desk 2019-01-26 16:59:18  nagababu, balakrishna, ys jaganmohan reddy, biryani story, ycp, tdp , janasena

హైదరాబాద్, జనవరి 26: నాగబాబు కొన్ని రోజులుగా మై ఛానల్ నా ఇష్టం పేరుతో అధికార టీడీపీ, విపక్ష వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు వరుసగా హీరో నందమూరి బాలకృష్ణపై కామెంట్ల రూపంలో వీడియోలు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలు నెట్ ఇంట్లో వైరల్ అయ్యాయి కూడా. ఇక అదే తరహాలో ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ పై మరో వీడియోను రిలీజ్ చేసాడు. ఈ వీడియోలో ‘రెండేళ్లు ఓపిక పట్టండి. మీరు పోగొట్టుకున్నదానికి నాలుగింతలు వచ్చేట్లు చేస్తా. రెండేళ్లు ఓపిక పడితే మన ప్లేట్లో మన బిరియాని మనమే తినొచ్చు అని జగన్ గతంలో పార్టీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలను కోట్ చేశారు. అదేవిదంగా ప్రజాసంకల్ప యాత్రలో ‘ఎన్నికల్లో డబ్బులు తీయ్యాలా అని జగన్ అంటున్న మరో వీడియోను ఇందులో చూపించారు.

ఇక ఈ వీడియోలో నాగబాబు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో గెలిచి ఏపీని బిర్యానీలా తినేద్దామని జగన్ ప్లాన్ చేశారని నాగబాబు విమర్శించారు. జగన్ కు తోడుగా ఆయన అనుచరులు కూడా ఉన్నారన్నారు. తాను ఇంతకుముందు విడుదల చేసిన వీడియోలో జగన్ వ్యాఖ్యలను సరిగ్గా అర్ధం చేసుకోలేదని కొందరు నెటిజన్లు చెప్పారన్నారు. ‘2014 ఎన్నికల్లో వొకడు 5 కోట్లు ఖర్చు పెట్టి పోయినయ్ అనుకోండి. ఇప్పుడు 5కోట్లో, 10కోట్లో ఖర్చు పెడతాడు. అంటే ఉదాహరణకు 15 కోట్లు అవుతుందనుకుంటే.. ఎన్నికల తర్వాత నాలుగురెట్లు సంపాదించుకోవచ్చని జగన్ చెప్పినదాని ప్రకారం రూ. 60 కోట్లు అవుతుంది. అంటే రూ.75 కోట్లు (15 + 60) సంపాదించుకోవచ్చని జగన్ చెబుతున్నారా? అని ప్రశ్నించారు.

ఇంకా జగన్ లాంటి క్లారిటీ, విజన్ ఉన్న నాయకుడు దేశంలో ఎక్కడ దొరుకుతాడని ప్రశ్నించారు. జగన్ కు అసాధారణ విజన్ ఉందనీ, ఇలాంటి నాయకుడు దేశంలో ఎక్కడా దొరకడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజల కష్టాలు చూసి కన్నీళ్లు పెట్టే నాయకుడు కావాలా? లేక ఇలాంటి నాయకులు కావాలో ప్రజలే తేల్చుకోవాలని స్పష్టం చేశారు. ఏపీ ప్రజలపై జగన్ కు ఉన్న ప్రేమ ఇదేనని విమర్శించారు. ఇక నాగబాబు ఇలాంటి వీడియోలు చేస్తూ.. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ఇంట్లో కూర్చొనే ప్రచారం కల్పిస్తున్నట్లు ఉంది.