ఈవీఎం ల పనితీరు భేష్ ...!!!

SMTV Desk 2019-01-25 15:09:01  Rajath kumar, EVM tampering issue, National voters day, Governor, Narasimhan, Congress, Ravindra bharati,

హైదరాబాద్‌, జనవరి 25: జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈవీఎంల పనితీరుపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్ తోసిపుచ్చారు. గతంలో సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరిగిందనడం పూర్తిగా అవాస్తమని, దీనిపై వివాదం అనవసరమని తేల్చిచెప్పారు. ట్యాంపరింగ్ జరిగిందని.. ఆధారాలతో నిర్ధరణ చేస్తామని ఎవరైనా ముందుకు వస్తే వారిని స్వాగతిస్తామని ఆయన ప్రకటన చేసారు. తనపై కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలపై స్పందించనని రజత్‌ కుమార్‌ అన్నారు.
త్వరలో తెలంగాణాలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఇప్పటి వరకు 16 లక్షల మంది నుండి ఓటరు దరఖాస్తులు వచ్చాయని రజత్‌కుమార్ చెప్పారు. గతంలో కూడా 1950 టోల్ ఫ్రీ నంబరు ఉండేదని, సాఫ్ట్‌వేర్‌కు మెరుగులు దిద్ది మళ్లీ అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆ నంబరుకు ఫోన్ చేసి సమస్యలు, అభ్యంతరాలు, ఫిర్యాదులు ఏమైనా ఉంటే చేయొచ్చన్నారు. కేంద్ర మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ ‌సహా తన పేరు హైదరాబాద్‌ నాంపల్లి నియోజకవర్గంలో జాబితాల్లో ఉండటంపై దర్యాప్తునకు ఆదేశించామని సీఈవో స్పష్టం చేశారు. ఈవీఎం, వీవీప్యాట్‌ల వినియోగం ఇప్పటిది కాదని, ఇలా అకస్మాత్తుగా ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు.