టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ..

SMTV Desk 2019-01-25 13:18:25  ycp, tdp, narasarao pet, kodela siva prasad, jagan mohan reddy, chandrababu

గుంటూరు, జనవరి 25: ఈరోజు గుంటూరు జిల్లాలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో ఇరు పార్టీల కార్యకర్తలు వొకరిపై వొకరు రాళ్ల దాడికి దిగారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు మరింత ముదరడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లాఠీ చార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ దాడిలో గాయపడిన ముగ్గురు వైసీపీ కార్యకర్తలను ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాల దాడితో పట్టణంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.


తెలుగు దేశం పార్టీ నేత కోడెల శివరాం పుట్టిన రోజు వేడుకల సందర్భంగా నరసరావుపేటలో టీడీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసం మీదుగా ర్యాలీ వెళ్తున్న సమయంలో స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు అనుకూలంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దాంతో వైసీపీ కార్యకర్తలు శ్రీనివాసరెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అది మరింత ముదరడంతో ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడికి పాల్పడ్డాయి.