దొంగ సర్వేలు జరిపించడం జగన్‌ కు అలవాటే

SMTV Desk 2019-01-25 12:51:17  Jaganmohan Reddy, Chandra Babu, tdp, ycp, 2019 elections

అమరావతి, జనవరి 25: ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 19 లోక్ సభ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని తాజాగా ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడయింది. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు దొంగ సర్వేలు జరిపించడం జగన్‌ కు అలవాటేనని వ్యాఖ్యానించారు. ఇటువంటి దొంగ సర్వేలతో ప్రజల మనసును మార్చలేరన్నారు. ఈరోజు ఉదయం టీడీపీ నేతలతో, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, సానుకూల నాయకత్వానికి తెలుగుదేశం ఓ ఉదాహరణ అయితే ప్రతికూల నాయకత్వానికి జగన్ రుజువని అన్నారు. 2014 ఎన్నికల సమయంలోనూ జగన్ ఇటువంటి సర్వేలనే చేయించారని, కానీ తెలుగుదేశం పార్టీనే ప్రజలు ఎంచుకున్నారని గుర్తు చేశారు.

పలువురు వైసీపీ నేతలు జగన్ లోని అహంభావాన్ని భరించలేక వైకాపాకు దూరం అవుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తాను లేఖను రాశానని చంద్రబాబు చెప్పారు. ఏపీకి ఇవ్వాల్సిన నిధులపై మోదీని జగన్ ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. విభజన తరువాత అన్యాయం జరిగిన ఏపీకి న్యాయం చేయాల్సిందేనని దేశమంతా కోరుతుంటే, వొక్క వైసీపీ మాత్రం ఆపని చేయడం లేదని, ప్రజలే వారికి బుద్ధిచెబుతారని అన్నారు.