కుంభమేళా ఆధారంగా రాహుల్ ??​​

SMTV Desk 2019-01-25 11:53:13  Rahul gandhi, Priyanka Gandhi, Aicc chief, Aicc secretary, All india congress, Uttar pradesh, Kumbh mela, Narendramodi, Bjp

న్యూఢిల్లీ, జనవరి 25: కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ తన చెల్లి ప్రియాంక గాంధీని పార్టీలోకి తీసుకువచ్చి యూపీ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఇక యూపీలో బీజేపీ హవాకు చెక్‌ పెట్టేందుకుసిద్ధమవుతున్నారు. హిందువులు అనే అంశంతోనే నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీని నిలువరించాలని కాంగ్రెస్ చీఫ్ భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో రాహుల్‌ గాంధీ పాల్గొనే 12 ర్యాలీల్లో తనకు తోడుగా ప్రియాంకను కూడా ఆయా సభల్లో ముందు నిలిపేలా రాహుల్‌ ప్రణాళికలు రచిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.లక్నోని కేంద్రంగా చేసుకొని యూపీ అంతట ప్రియాంక ప్రచార పర్వంతో హోరెత్తించనున్నారు.
హిందుత్వం అనే అంశంతో హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో బీజేపీ దూసుకుపోతుంటే అదే అంశాన్ని తనకు అనుకూలంగా మలుచుకునెల రాహుల్‌ పావులు కదుపుతున్నారు. యూపీలో జరుగుతున్న కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించే ఘట్టాన్ని రాహుల్‌ ఇదే సరియైన అవకాశంగా భావిస్తున్నారు. ఫిబ్రవరిలో కుంభమేళాలో పాల్గొనే రాహుల్‌ ఈ కార్యక్రమాన్ని తమ పార్టీకి అనుకూలంగా మలిచేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ఇక కుంభమేళాలో లక్షలాది మంది వీక్షిస్తుండగా పుణ్యస్నానం ఆచరించడం ద్వారా హిందూ మూలాలను బలంగా ప్రజల్లోకి తీసుకుపోవచ్చని రాహుల్‌ భావిస్తున్నారు. రాహుల్‌ జంధ్యంతో పాటు పసుపు పంచె, కండువా ధరించి గంగా జలాల్లో పుణ్యస్నానం ఆచరిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాహుల్‌ స్నానం చేస్తుండగా 12 మంది పండితులు వేదమంత్రాలను జపిస్తారని వెల్లడించాయి. గతంలో రాహుల్‌ జంధ్యం ధరించే బ్రాహ్మణుడని కాంగ్రెస్‌ ప్రతినిధి సుర్జీవాలా చెప్పిన విషయం మనకి తెలిసిందే .

రాజస్ధాన్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పుష్కర్‌లోని బ్రహ్మ ఆలయంలో ఆలయ పూజరి అడిగిన వివరాల మేరకు రాహుల్‌ తాను బ్రాహ్మణుడినని, తమది దత్తాత్రేయ గోత్రమని బదులిచ్చిన సంగతి విదితమే. అప్పుడే రాహుల్ గాంధీ తొలిసారి తన కులగోత్రాలను బయటకి వెల్లడించారు.

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు కీలకమైన ఉత్తరప్రదేశ్‌పై కాంగ్రెస్‌ పార్టీ ప్రధానంగా దృష్టిసారించింది. ప్రియాంక గాంధీ రావడంతో పాటు తమ పార్టీ హిందువులకు వ్యతిరేకం కాదనే బలమైన సంకేతాలు పంపాలని ఆ పార్టీ యోచిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో మెరుగైన ఫలితాల కోసం తాము శక్తియుక్తులను కూడదీసుకుని బలం‍గా పోరాడతామని తన నియోజకవర్గం అమేథి పర్యటన సందర్భంగా రాహుల్‌ స్పష్టం చేశారు.