ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం సవరణపై స్టే నిరాకరణ !!

SMTV Desk 2019-01-24 15:10:50  Sc,ST atrocity act, supreme court,central government,

​ఢిల్లీ, జనవరి 24: ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిందితుడికి ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం 2018లో తీసుకువచ్చిన కొత్త సవరణలపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎస్పీ, ఎస్టీలపై వేధింపులకు పాల్పడిన వారిని ఎలాంటి విచారణ లేకుండానే అరెస్ట్ చేసేందుకు ఈ సవరణ చట్టం అనుమతిస్తోంది. ఈ చట్ట సవరణను సవాల్ చేస్తూ సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. మార్చి 20న కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్లతో కలిపి, అన్ని పిటిషన్ల విచారణ చేపడతామని ​న్యాయస్థానం తెలిపింది.
ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం పెద్ద ఎత్తున దుర్వినియోగమవుతోందని, ఈ నేపథ్యంలో తక్షణ అరెస్టుల నుంచి రక్షణ కల్పిస్తూ గత ఏడాది మార్చి 20న సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. దీంతో, దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంలో సుప్రీం తీర్పును పక్కనబెడుతూ ఆగస్టు 9న కేంద్ర ప్రభుత్వం సవరణ బిల్లును ఆమోదించింది. ముందస్తు బెయిల్ ను నిరాకరిస్తూ చట్టానికి సవరణలు చేసింది. ఈ సవరణలకు వ్యతిరేకంగా పలు పిటిషన్లు సుప్రీంలో దాఖలయ్యాయి.