కోడికత్తి కేసులో ఎన్ఐఏ దూకుడు

SMTV Desk 2019-01-23 19:10:17  YS Jagan mohan reddy, Chandrababu, Jagan attempt to murder, High court, Petition, NIA

అమరావతి, జనవరి 23: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోడికత్తి కేసు విచారణలో ఎన్ఐఏ దూకుడు పెంచింది. హైకోర్టు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈ కేసును విచారిస్తున్న ఎన్ఐఏ బుధవారం చార్జిషీట్ దాఖలు చేసి ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తికి చార్జిషీట్‌ను సమర్పించింది. చార్జిషీట్ తోపాటు నిందితుడు శ్రీనివాసరావు జైలులో రాసిన 22 పేజీల పుస్తకాన్నికూడా జత చేసింది. చార్జిషీట్‌ కాపీని ఎవరికీ అందకుండా చూడాలని, గోప్యంగా ఉంచాలని కోర్టు సిబ్బందిని ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆదేశించారు. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జె.శ్రీనివాసరావును ఏ1 నిందితుడిగా చార్జిషీట్ లో పేర్కొంది. కుట్రకోణంపై విచారణ కొనసాగిస్తామని కోర్టుకు ఎన్‌ఐఏ అధికారులు స్పష్టం చేశారు. చార్జిషీట్‌లో ఏముందో అనేది ఈ నెల 25న తెలిసే అవకాశం ఉంది.

ఈ కేసులో పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా అత్యవసరంగా చార్జిషీట్ దాఖలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని శ్రీనివాస్ తరఫున న్యాయవాది మట్టా జయకర్‌ ప్రశ్నించారు. మరోవైపు వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ విచారణను నిలిపివేయాలంటూ రాష్ట్రప్రభుత్వం హైకోర్టులో స్టే వేసింది. అయితే ఎన్ఐఏ విచారణను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆ కేసుకు సంబంధించి విచారణను హైకోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది. ప్రభుత్వం వేసిన పిటీషన్ పై ఈనెల 30లోపు కౌంటర్ దాఖలు చెయ్యాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇకపోతే ఈ అంశం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య జరుగుతున్న వ్యవహారం నేపథ్యంలో ఈకేసును సుప్రీంకోర్టులో విచారించాలంటూ వైఎస్ జగన్ తరపు న్యాయవాదులు కోరిన విషయం తెలిసిందే. కేసు విచారణ ఈనెల 30కి వాయిదా వేసినప్పటికీ ఇంతలోనే ఎన్ఐఏ దూకుడు ప్రదర్శించి చార్జిషీట్ దాఖలు చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం పునరాలోచనలో పడింది.