ప్రియాంక నియామకంపై నేతల స్పందన..

SMTV Desk 2019-01-23 18:40:22  Rahul Gandhi, priyanka gandhi, AICC, AICC General Secretary, 2019 elections, UP East incharge, Congress party

న్యూఢిల్లీ, జనవరి 23: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ప్రియాంక గాంధీని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, ఉత్తర్‌ప్రదేశ్‌ తూర్పు ఇంచార్జ్ గా నియమించడంపై కాంగ్రెస్‌ పార్టీలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నందుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రియాంక నియామకంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీకి పునర్‌వైభవం వస్తుందన్న ఆశాభావాన్ని పలువురు సీనియర్‌ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రియాంక ప్రత్యక్ష రాజకీయ ప్రవేశంపై కాంగ్రెస్‌ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ‘ఇందిరా గాంధీ మళ్లీ వచ్చారంటూ పోస్టర్లు ప్రదర్శించారు.

సీనియర్‌ నేతలు వీరప్ప మొయిలీ, కపిల్‌ సిబల్‌.. ‘ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీగా ప్రియాంక గాంధీని నియమించడాన్ని స్వాగతిస్తున్నాం. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆమె ప్రవేశం పార్టీ శ్రేణుల్లోను, పార్టీకి కొత్త ఉత్సాహం తీసుకువస్తుందన్నారు. ప్రియాంక నియామకాన్ని ‘గేమ్‌ చేంజర్‌ గా యూపీ పీసీసీ అధ్యక్షుడు పియూష్‌ మిశ్రా అభివర్ణించారు. ‘ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ప్రియాంక గాంధీని ఎంతో కాలంగా కోరుతున్నామని, యూపీ ఈస్ట్‌ ఇన్‌చార్జిగా ఆమె నియామకం మాకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. ఆమె నియామకంతో పార్టీ శ్రేణులు పండగ చేసుకుంటున్నారని తెలిపారు. ప్రియాంక ఎంట్రీ ప్రభావం ఉత్తరప్రదేశ్‌కే పరిమితం కాదని దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉంటుంద ని మోతిలాల్‌ వోరా అభిప్రాయపడ్డారు. ఇక ప్రియాంక విదేశాల నుంచి తిరిగి రాగానే ఫిబ్రవరి 1న బాధ్యతలు చేపడతారని రాజీవ్‌ శుక్లా వెల్లడించారు.