లోక్ సభ ఎన్నికలకు సీఎం వ్యూహాలు..

SMTV Desk 2019-01-23 15:54:05  Odisha cm, Naveen Patnaik, Narendra Modi, campaign rally, Elections 2019

భువనేశ్వర్‌, జనవరి 23: 2019 లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు వొరిస్సా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ వ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రెస్‌, బీజేపీలతో పొత్తు పెట్టుకునేదిలేదని ఇప్పటికే ప్రకటించిన నవీన్ పట్నాయక్‌ ఆ దిశగా ప్రచార పర్వాన్ని పరుగులెత్తించేందుకు సన్నద్ధమయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల వొడిషాలో ర్యాలీలు నిర్వహించిన ప్రాంతాలన్నింటిలో భారీ బహిరంగసభలకు పట్నాయక్‌ శ్రీకారం చుట్టారు. డిసెంబర్‌ 24 నుంచి జనవరి 15 మధ్య ప్రధాని నరేంద్ర మోదీ వొడిషాలోని బరిపడ, ఖుర్ధా, బొలన్‌గిర్‌లలో భారీ ర్యాలీలను నిర్వహించారు. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో భారీ సభలకు హాజరుకావాలని నవీన్‌ పట్నాయక్‌ నిర్ణయించారు.

గత సంవత్సరం సెప్టెంబర్‌లో మోదీ వొరిస్సాలోని జర్సుగుడలో బహిరంగ సభలో పాల్గొనగా గురువారం అదే ప్రాంతంలో పట్నాయక్‌ భారీ బహిరంగ సభలో పాల్గొంటారని బీజేడీ సీనియర్‌ నేత వెల్లడించారు. ఇక ఈనెల 24న బొలన్‌గిరిలో జరిగే సభకు సీఎం హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఖుర్ధాలోనూ త్వరలోనే సీఎం బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. వొడిషాలో మెరుగైన విజయాలు సాధించేందుకు ఉవ్విళ్లూరుతున్న భాజపాకు చెక్‌ పెట్టేందుకే సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఈ తరహా వ్యూహంతో ముందుకెళుతున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.