పెద్దరికం నిలబెట్టుకో....!

SMTV Desk 2019-01-23 15:46:17  TG Venkatesh, MP, Janasena party, Pawan kalyan

విశాఖపట్నం, జనవరి 23: జిల్లాలోని పాడేరు బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సభలో పవన్ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదుపుతప్పి మాట్లాడితే తాను వేరే వ్యక్తినంటూ వార్నింగ్ ఇచ్చారు. తాను ఏమీ ఆశించకుండా 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చానని అలాంటిది తెలుసుకోకుండా పిచ్చిపిచ్చిగా మాట్లాడతావా అంటూ విరుచుకుపడ్డారు.

పరిశ్రమలు నిర్వహిస్తూ నదులను కలుషితం చేస్తున్నా నువ్వా నన్ను విమర్శించేది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పనికిమాలిన మాటలు కాకుండా పనికి వచ్చే మాటలు మాట్లాడటం నేర్చుకోవాలని హితవు పలికారు. ప్రజల మనోభవాలతో ఆడుకోకు అని వార్నింగ్ ఇచ్చారు. తెలిసీ తెలియకుండా మాట్లాడొద్దని పెద్దమనిషిగా మాట్లాడాలని సూచించారు. పెద్దరికం నిలబెట్టుకోండని స్పష్టం చేశారు. తాను వేరేలా మాట్లాడితే తట్టుకోలేవ్ జాగ్రత్త అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేన వద్దనుకుంటే పడేసిన రాజ్యసభ సీటుపై కూర్చుని మాట్లాడుతున్నావన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.