కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక..

SMTV Desk 2019-01-23 15:27:41  Rahul Gandhi, priyanka gandhi, AICC, AICC General Secretary, 2019 elections, UP East incharge, Narendra Modi

న్యూఢిల్లీ, జనవరి 23: రాబోయే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. దీంతో ప్రియాంకను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇక ఆమెకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు తూర్పు యూపీ ప్రచార ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలను అప్పగించింది. ప్రియాంక నియామకంతో ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా స్టార్‌ క్యాంపెయిన్‌ర్‌గా ఆమె సేవలను వాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. జరగబోయే ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని దీటుగా ఎదుర్కొనే క్రమంలో ప్రియాంకను తెరపైకి తీసుకువచ్చింది.

ఈ సందర్బంగా ఉత్తర ప్రదేశ్ తూర్పు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ఫిబ్రవరి మొదటి వారం నుంచి ప్రియాంక గాంధీ బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ప్రియాంక గాంధీని పార్టీ ప్రధాన కార్యదర్శిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నియమించారని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ఇక జ్యోతిరాదిత్య సింధియాకు పశ్చిమ యూపీ బాద్యతలు అప్పగించారు. ఏఐసీసీ సంస్ధాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా కేసీ వేణుగోపాల్‌ను నియమించారు. గులాం నబీ ఆజాద్‌ను యూపీ ఇన్‌ఛార్జ్‌గా తప్పించి ఆయనకు హర్యానా బాధ్యతలు కట్టబెట్టారు. జ్యోతిరాదిత్య సింధియా యూపీ పశ్చిమ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలను తక్షణమే చేపడతారని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.