కోడి కత్తి కేసులో మరో కోణం...

SMTV Desk 2019-01-23 12:13:02  YS Jagan mohan reddy, Chandrababu, Jagan attempt to murder, High court, Petition, NIA

అమరావతి, జనవరి 23: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హత్యాయత్నం కేసుపై రోజుకో వివాదం తలెత్తుతోంది. తాజాగా రాష్ట్ర, జాతీయ దర్యాప్తు సంస్థల మధ్య వివాదం నెలకొంది. ఈ కేసుకు సంబంధించిన విచారణను సిట్‌ను నుంచి తప్పించిన హైకోర్టు జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే తమకు ఏపీ పోలీసులు సహకరించడం లేదని ఆధారాలు, రికార్డులు, ఇతర పత్రాలను ఇవ్వడంలేదంటూ ఎన్‌ఐఏ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిని విచారించిన ధర్మాసనం తక్షణం ఎన్‌ఐఏకు అప్పగించాలని ఈ నెల 19న సిట్‌ను ఆదేశించింది.

అయితే కేసుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను ఎన్ఐఏకు ఇవ్వడం కుదరదంటూ సిట్ ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జగన్‌పై దాడి కేసు నుంచి ఎన్ఐఏను తప్పించాలంటూ ఏపీ ప్రభుత్వం కూడా పిటిషన్ వేయడం, అది ఇంకా పెండింగ్‌లో ఉన్నందున డాక్యుమెంట్లు ఇవ్వలేమని సిట్ పిటిషన్‌లో పేర్కొంది. దీంతో ఈ కేసులో ఏం జరుగుతుందోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.