అంతిమ వీడ్కోలు..

SMTV Desk 2019-01-23 11:11:57  Sivakumara swamy, siddaganga, narendra modi, kumara swamy, deva gowda

తుమకూరు, జనవరి 23: సోమవారం 111 ఏళ్ల డాక్టర్‌ శ్రీ శివకుమార స్వామి కన్నుమూసిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో ఆధ్యాత్మిక, విద్యా ప్రదాత తుమకూరు సిద్ధగంగ మఠాధిపతి శివకుమార స్వామి అంత్యక్రియలు మంగళవారం ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో లక్షలాది మంది భక్తులు పాల్గొని స్వామి పార్థివ దేహాన్ని కడసారి దర్శించుకున్నారు. కర్ణాటక సీఎం కుమారస్వామి, కేంద్రమంత్రులు సదానందగౌడ, నిర్మలా సీతారామన్, మాజీ ప్రధాని దేవెగౌడతో పాటు పలువురు నేతలు నివాళులర్పించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. స్వామి దగ్గరకు ఎప్పుడు వెళ్లినా తనను ఓ కొడుకులా భావించి ప్రేమతో ఆశీర్వదించే వారనీ, ఇప్పుడు ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడం బాధగా ఉందని విచారాన్ని వ్యక్తం చేసారు. కాగా మంగళవారం సాయంత్రం 4.30 గంటల వరకు ప్రజలందరికీ దర్శన భాగ్యం కల్పించారు. ఆ తర్వాత లక్ష రుద్రాక్షలతో నిర్మించిన పల్లకిలో సమాధి ప్రదేశం వరకు ఊరేగింపుగా తెచ్చారు. అనతరం కాషాయ వస్త్రాలను స్వామి పార్థివ దేహానికి తొడిగి, త్రివర్ణపతాకాన్ని కప్పారు. తరువాత పోలీసులు గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. స్వామి గతంలో సూచించిన భవనంలోని క్రియా సమాధిలో స్వామి పార్థివ దేహాన్ని ఉంచి రాష్ట్రంలోని పుణ్య నదుల నుంచి తెచ్చిన జలాలతో అభిషేకించారు. ఆ తర్వాత రెండు క్వింటాళ్ల విభూతి, 900 కేజీల ఉప్పు, బిల్వ పత్రాలు సమాధిలో ఉంచారు. ఆ తర్వాత పద్మాసనంలో స్వామిజీని కూర్చొబెట్టి ఖననం చేశారు.