వైఎస్ షర్మిల కేసు : ఆరుగురు అరెస్ట్

SMTV Desk 2019-01-22 19:44:27  YS Sharmila, Janasena fans, Janasena party, Police case, PC Anajni kumar , Social media

హైదరాబాద్, జనవరి 22: వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల తనపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై సైబర్ క్రైం దర్యాప్తులో వేగం పెంచింది. షర్మిలపై నెగిటివ్ గా ప్రచారం చేసిన వారిలో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఆరుగురికి 41(ఎ) నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో మొత్తం 15 సోషల్ మీడియా వెబ్ సైట్లను గుర్తించిన పోలీసులు మిగితావారికి కూడా నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. యూట్యూబ్ నుంచి వివరాల కోసం వేచి చూస్తున్నారు. వివరాలు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైం అదనపు డీసీసీ రఘువీర్ తెలిపారు.

హీరో ప్రభాస్‌తో తనకు సంబంధముందని సోషల్‌ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్‌ షర్మిల ఈ నెల 14న హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దుష్ప్రచారానికి పాల్పడ్డారనే అనుమానాలతో యూట్యూబ్‌లో మొత్తం 15 వీడియో లింకుల్ని పోలీసులు గుర్తించారు. అవి ఏయే ఐపీ అడ్రస్‌ల ద్వారా అప్‌లోడ్‌ చేశారో వివరాలు సేకరించి వాటి ఆధారంగా బాధ్యుల్ని గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీరంతా హైదరాబాద్‌ వాసులేనని ప్రాథమికంగా గుర్తించారు.