ఇకపై జగన్ ఏది చెబితే అది....!!!

SMTV Desk 2019-01-22 19:23:56  Rajampeta constituency MLA, Meda mallikarjuna reddy, TDP, YSRCP

అమరావతి, జనవరి 22: తెదేపా కీలక నేత రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తన పార్టీకి రాజీనామా చేసి వైసీపీలోకి చేరడానికి సిద్దమవుతున్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన మేడా మల్లికార్జునరెడ్డి తన రాజీనామా విషయాన్ని బహిర్గతం చేశారు. వైఎస్ జగన్ సైతం తమ భేటీలో ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాతే పార్టీలో చేరాలని చెప్పారని తెలిపారు. అయితే స్పీకర్ ఫార్మెట్ లో బుధవారం రాజీనామా చేయనున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం ఈనెల 31న తనతోపాటు తన కార్యకర్తలు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. ఇకపై వైఎస్ జగన్ ఏది చెబితే అది చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడును ఓడించి జగన్ ను సీఎం చేసేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్రంలో చాలా మంది బాబు నిన్ను నమ్మం బాబూ అంటూ పార్టీ వీడతారంటూ చెప్పుకొచ్చారు.

ఇకపై తాను తన కుటుంబం జగన్ ను నమ్ముకున్నామని జగన్ ఏది చెబితే అది చేసేందుకు సిద్ధంగా ఉన్నాని మేడా మల్లికార్జునరెడ్డి తెలిపారు. చంద్రబాబు నాయుడు దోపిడీని అవినీతిని భరించలేక తాను పార్టీ వీడుతున్నట్లు తెలిపారు. వైఎస్ జగన్ నైతిక విలువలు తెలిసిన వ్యక్తి అంటూ కొనియాడారు. అందువల్లే తాను పార్టీలోకి చేరే ముందు పదవికి రాజీనామా చెయ్యాలని కండీషన్ పెట్టిన విషయాన్ని స్పష్టం చేశారు. ప్రజాసేవ చెయ్యాలన్న ఆకాంక్ష జగన్ కుటుంబానికే ఉందన్నారు. ప్రజల కోసం పోరాటాలు చేసిన కుటుంబం రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటూ కొనియాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజాప్రస్థానం పేరుతో ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తే, ఆయన తనయ వైఎస్ షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. ఇటీవల వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టి ప్రజల సమస్యలను తెలుసుకున్నారని చెప్పుకొచ్చారు. జగన్ లాంటి నాయకుడు రాష్ట్రానికి ఎంతో అవసరమని చంద్రబాబు నాయుడు చెప్పే మాయమాటలను తిప్పికొట్టి జగన్ ను సీఎం చెయ్యడమే లక్ష్యంగా తాము పనిచేస్తామని ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి హామీ ఇచ్చారు.