సిద్దగంగా స్వామీజీ శివైక్యం

SMTV Desk 2019-01-21 17:32:51  Siddaganga Mutadipathi Shivakumara swamiji, Unexpected Death, Karnataka

కర్ణాటక, జనవరి 21: సోమవారం ఉదయం తుముకూరు సిద్దగంగా మఠాధిపతి శివకుమార స్వామీజీ ఆకస్మిక మరణం పొందడంతో కర్ణాటక రాష్ట్రం వొక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. కేవలం కర్నాటకే కాకుండా ప్రపంచంవ్యాప్తంగా ఉన్న ఆయన భక్తులు అంతా ఈ వార్త విన్న మరుక్షణం తుముకూరుకి చేరుకుంటున్నారు. సిద్దగంగా ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించి లక్షల మందికి ఉచిత విద్యను అందించారు స్వామీజీ. పేద విద్యార్థులకు భోజనం, విద్య, వసతిని దశాబ్దాలుగా ఉచితంగా అందిస్తున్నారు. మఠంలో చదువుకున్న విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా వివిధ ఉన్నత హోదాల్లో ఉన్నారు. స్వామీజీ గురు కుల హౌస్ లలో ఐదు నుంచి 16 ఏళ్ల లోపు వయస్సున 8వేల 500మందికి పైగా పిల్లలు విద్యనభ్యసిస్తున్నారు.

365 రోజులు, 24 గంటలు పేదరికంలో ఉన్న ప్రతి విద్యార్థి కోసం సిద్దగంగా మఠం తలుపులు తెరిచే ఉండేవి. లక్షలాది మంది పిల్లలకు ఉచిత విద్య, భోజనం, వసతిని కల్పించి వారిని ఉన్నతమైన వ్యక్తులుగా స్వామీజీ తీర్చిదిద్దారు. దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా గతంలో వొకసారి సిద్దగంగా మఠాన్ని సందర్శించి పేద విద్యార్థులకు స్వామీజీ చేస్తున్న సేవలు వెలకట్టలేనివని అన్నారు. తుమూకూరు ప్రజలు, రైతులు లబ్ధి పొందేందుకు యాన్యువల్ అగ్రికల్చరల్ ఫెయిర్ ను స్వామీజీ ప్రారంభించారు. స్వామీజి మరణవార్తను కర్ణాటక ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. నడిచే దేవుడిగా అందరూ పూజిస్తారు. కడసారి చూసేందుకు ప్రజలు తరలివస్తుండటంతో మఠం దగ్గర అధికారులు భారీగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. ఎప్పుడూ కొట్లాడుకునే సీఎం కుమారస్వామి, ప్రతిపక్ష నేత యడ్యూరప్ప జాయింట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆయన మృతి విషయాన్ని వెల్లడించారు. కర్ణాటక ప్రజలకు తీరని లోటు అన్నారు.

శివకుమార స్వామీజీ కర్ణాటక రాష్ట్రం రామనగర జిల్లాలోని మాగడి తాలూకా దగ్గర్లోని వీరాపురలో ఏప్రిల్ 1, 1907న పటేల్ హొన్నప్ప, గంగమ్మ దంపతులకు జన్మించారు. ఆయన వయస్సు ఇప్పుడు 111 ఏళ్లు. లింగాయుత వర్గానికి చెందిన స్వామీజీ చిన్నతనం నుంచే ఆథ్యాత్మికతవైపు అడుగులు వేశారు. ఇంగ్లీషు, కన్నడ, సంస్కృతంలో విద్యనభ్యసించారు. వీరాపుర, నాగవళ్లిలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. ఆ తర్వాత తుముకూరులోని ప్రభుత్వ హైస్కూల్ లో సెకండరీ విద్యను పూర్తి చేశారు. ఇంటర్మీడియట్, డిగ్రీ పట్టాలను బెంగళూరు యూనివర్శిటీ నుంచి అందుకున్నారు.

ఆ తర్వాత తుముకూరులో సిద్దగంగా మఠం స్థాపించి లక్షల మంది పేద విద్యార్థులకు ఉచిత విద్య, భోజన, వసతి సదుపాయాన్నికల్పించారు. కుల, మత, వర్ణ భేధాలు లేకుండా పేదరికంతో ఉన్న ప్రతి పిల్లాడినీ చేరదీశారు. 1965లో కర్నాటక యూనివర్శిటీ స్వామీజీకి లిటరేచర్ లో గౌరవ డాక్టరేట్ అందించింది. శివకుమార్ స్వామీజీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2007లో కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక రత్న అవార్డుతో సత్కరించింది. 2015లో కేంద్రప్రభుత్వం పద్మభూషణ్ తో సత్కరించింది. స్వామీజీ ఎప్పుడూ నుదిటిన విబూది రాసుకునేవారు. చివరి క్షణాల్లో ఆస్పత్రి బెడ్ పై ఉండి కూడా నుదట విభూది రాసుకోవటం ఆయన ఆధ్యాత్మికతకు మచ్చుతునక.