రోజర్ ఫెదరర్‌ పై సచిన్ ట్వీట్..

SMTV Desk 2019-01-21 16:18:41  australian open, tennis, roger federer, sachin tendulkar

హైదరాబాద్, జనవరి 21: ఆస్ట్రేలియా టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్‌కు చేదు అనుభవం ఎదురైంది. దానిపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన ట్విట్టర్‌ ఖాతాలో స్పందించాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీలో భాగంగా శనివారం అక్రిడేషన్ పాస్ మర్చిపోయినందుకు గాను రోజర్ ఫెదరర్‌ను డ్రెస్సింగ్‌ రూంలో వెళ్లకుండా అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. అక్రిడేషన్ పాస్ లేకపోవడంతో ఫెదరర్ అందరితో పాటే నిలబడగా.. వెంటనే ఆయన కోచ్ ఇవాన్ జుబిసిస్ అక్కడికి వచ్చి ఆయన ఐడీ కార్డ్ చూపించిన తర్వాత ఫెదరర్‌ను లోపలి అనుమతించారు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియోని ఆస్ట్రేలియన్ ఓపెన్ తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. రోజర్ ఫెదరర్‌కి కూడా అక్రిడేషన్ కావాలంటూ ట్వీట్ చేసింది. ఈ వీడియోపై సచిన్ టెండూల్కర్ తన ట్విట్టర్‌లో "ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెక్యూరిటీ ఆఫీసర్ తన పనిని సక్రమంగా నిర్వర్తించాడు. ఇది చూసేందుకు మంచిగా ఉంది. అదే సమయంలో ఫెదరర్ స్పందించిన తీరు బాగుంది. ఇలాంటి సన్నివేశాలు ఈరోజుల్లో చాలా అరుదు. ఇలాంటి వాటితో ఫెదరర్ లాంటి గ్రేట్ అథ్లెట్‌పై గౌరవం మరింతగా పెరుగుతుంది" అని ట్వీట్ చేశాడు.ఆస్ట్రేలియన్ ఓపెన్ నిబంధనల ప్రకారం అందరు అక్రిడేషన్ కార్డులను తీసుకెళ్లడం తప్పనిసరి. ఐడీ కార్డులు లేకపోవడంతో ఆటగాళ్లను నిలిపేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలో మరియా షరపోవాను కూడా ఐడీ కార్డు కోసం కారిడార్లో నిలిపేశారు.