కేసు విచారణ నుంచి తప్పుకున్న సుప్రీం ప్రధాన న్యాయమూర్తి..

SMTV Desk 2019-01-21 15:37:04  Supreme court of India, CBI chief, Justice Ranjan Gogoi, recused

న్యూఢిల్లీ, జనవరి 21: సిబిఐ డైరెక్టర్ పై దాఖలైన పిటిషన్‌ విచారణ నుంచి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ తప్పుకున్నారు. సిబిఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం నాగేశ్వరావు నియామకాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ విచారణ నుంచి గొగోయ్‌ తప్పుకున్నారు. నూతన సీబీఐ డైరెక్టర్‌ను ఎంపిక చేసే కమిటీలో తాను సభ్యుడిగా ఉన్నందున ఈనెల 24 నుంచి జరిగే ఈ కేసు విచారణకు దూరంగా ఉన్నానని, మరో బెంచ్‌ ఈ పిటిషన్‌ను విచారిస్తుందని ఆయన చెప్పారు. సీబీఐ చీఫ్‌ నియామకంలో పారదర్శకత ఉండాలని ఆయన పిలుపు ఇచ్చారు.

అయితే 1986 వొరిస్సా కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి ఎం నాగేశ్వరరావును గత సంవత్సరం అక్టోబర్‌ 23న సీబీఐ తాత్కాలిక చీఫ్‌గా కేంద్రం నియమించింది. అప్పటి సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్దానాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో వారిని ప్రభుత్వం సెలవుపై పంపింది. మరోవైపు అలోక్ వర్మ, రాకేష్ ఆస్ధానాల వ్యవహారం న్యాయస్ధానానికి చేరిన క్రమంలో నాగేశ్వరరావును ప్రభుత్వం అడిషనల్‌ డైరెక్టర్‌ స్ధాయికి ప్రమోట్‌ చేసింది.