జడ్జీనీ పొగిడిన బాలుడు

SMTV Desk 2017-06-01 12:22:56  court,Jakob,5 years child,Judge,USA

రొడే ఐలాండ్‌(యూఎస్‌ఏ), జూన్ 1 : తండ్రి వెంట న్యాయస్థానానికి వచ్చిన అయిదేళ్ల చిన్నారి జాకబ్‌ను చూడగానే ధర్మపీఠంపై ఉన్న న్యాయమూర్తికి ముచ్చటవేసింది. కేసు పరిష్కారంలో ఆ కుర్రాడి సాయం తీసుకోవాలనుకున్నారు. జాకబ్‌ తండ్రి ట్రాఫిక్‌ ఉల్లంఘనకు పాల్పడిన కేసువిచారణ ప్రారంభం కాగానే ఆ చిన్నారిని జడ్జి తన వద్దకు పిలిపించుకున్నారు. కొద్దిసేపు పిల్లాడితో మాటలు కలిపిన తర్వాత జడ్జి...‘మీ నాన్న చేసిన తప్పుకు ఏ శిక్ష విధించమంటావ్‌? 90 డాలర్లు జరిమానా విధించనా? లేదా 30 డాలర్లతో సరిపెట్టనా .... అసలు శిక్షించకుండానే వదిలేయమంటావా?’ అంటూ జాకబ్‌ మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే ఆ కుర్రాడు ఇచ్చిన సమాధానం న్యాయమూర్తి సహా కోర్టులో ఉన్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ జాకబ్‌ ఇచ్చిన సమాధానం ఏమిటంటే... ‘‘మీరు చాలా మంచి జడ్జి’’ అని. ఇప్పుడు ఈ సమాధానమే అంతర్జాలంలో వైరల్‌ అవుతోంది. ఫేస్‌బుక్‌లో ఈ వీడియోను ఒక్క రోజులో 80 లక్షల మంది వీక్షించారు. తన తండ్రికి ఏ శిక్ష విధించాలో చెప్పకుండానే ..అదే సమయంలో క్షమించి వదిలిపెట్టమని తన నోటితో చెప్పకుండానే తెలివిగా తన తండ్రిని ఆ చిరు కష్టం నుంచి గట్టెక్కించాడు జాకబ్‌. అయిదేళ్ల కుర్రాడు అందరి మనసులను గెలుచుకున్న ఈ ఘటన అమెరికాలోని రొడే ఐలాండ్‌లో ఉన్న ప్రావిడెన్స్‌ మున్సిపల్‌ కోర్టులో జరిగింది. ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు సంబంధించిన చిన్నచిన్న కేసులు ఇక్కడ విచారించి జరిమానాలు వేస్తుంటారు. విచారణ దృశ్యాలు ‘ప్రావిన్స్‌లో పట్టుబడ్డవారు’’ పేరుతో టీవీలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంటాయి.