అభివృద్ధి రేటులో తెలంగాణ రాష్ట్రం ముందంజ...!!

SMTV Desk 2019-01-19 14:11:10  Telangana state, Governor narashimhan, Telangana assembly

హైదరాబాద్, జనవరి 19: శనివారం జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి రేటులో ముందంజలో ఉంది అని, గత నాలుగున్నరేళ్లలో నీటిపారుదల రంగానికి రూ.77 వేల 777 కోట్లు ఖర్చు చేశామన్నారు. అంతేకాక రాబోయే కాలంలో రూ.లక్షా 17 వేల కోట్ల విలువైన పనులు చేస్తామని ఆయన తెలిపారు. విద్యుత్‌ కోతలను అధిగమించి ప్రభుత్వం తొలి విజయం సాధించిందని పేర్కొన్నారు. మిషన్‌ కాకతీయ సత్ఫలితాలిచ్చిందని గవర్నర్ తెలిపారు.

ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, కళ్యాణలక్ష్మి పథకం దేశానికి ఆదర్శమని చెప్పుకొచ్చారు. పారిశ్రామిక, ఐటీ రంగాల్లో పారదర్శక విధానాలు అమలవుతున్నాయన్నారు. ఐటీ రంగం అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచేందుకు చర్యలు చేపట్టామని గవర్నర్ వెల్లడించారు. జీఎస్టీ వసూళ్లలోనూ తెలంగాణ.. దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. మార్చి నాటికి మిషన్‌ భగీరథ ద్వారా అన్ని గ్రామాల్లో ఇంటింటికి నల్లా నీరు సరఫరా చేస్తామని చెప్పారు.