శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన 51 మంది మహిళలు..

SMTV Desk 2019-01-18 18:13:54  sabarimala temple, Supreme court of India, kerala government, Note

న్యూఢిల్లీ, జనవరి 18: భారతదేశ సర్వోన్నత న్యాయస్ధానం శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటివరకూ 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళలు 51 మంది ఆలయంలో ప్రవేశించారని కేరళ ప్రభుత్వం శుక్రవారం సుప్రీం కోర్టుకు సమర్పించిన నోట్‌లో పేర్కొంది. శబరిమల ఆలయ సంప్రదాయం ప్రకారం ఋతుక్రమంలో ఉన్న 10 నుంచి 50 సంవత్సరాల లోపు మహిళలను ఆలయంలోకి అనుమతించని సంగతి తెలిసిందే. అయితే సుప్రీం కోర్టు శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని గత ఏడాది సెప్టెంబర్‌ 28న తీర్పును వెలువరించింది.

ఈ నేపథ్యంలో 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళల ఆలయ ప్రవేశం ఆలయ నియమాలకు విరుద్ధమని హిందూ సంఘాలు సుప్రీం తీర్పుపై భగ్గుమన్నాయి. దాంతో మహిళలను ఆలయంలోకి రాకుండా ఎక్కడికక్కడ ఆందోళనకారులు అడ్డుకోవడంతో పలుమార్లు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈనెల 2న ఇద్దరు మహిళలు కనకదుర్గ, బిందులు ఆందోళనకారుల నిరసనలను నిలువరిస్తూ శబరిమల ఆలయంలోకి ప్రవేశించడం కలకలం రేపింది. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం ఇప్పటివరకూ ఋతుక్రమ వయసు ఉన్న 51 మంది మహిళలు ఆలయంలో ప్రవేశించారని సుప్రీం కోర్టుకు నోట్‌ సమర్పించింది.