ట్రంప్‌ నకిలీ రాజీనామా..

SMTV Desk 2019-01-18 13:08:23  America president, Donald Trump, resignation, Washington Post, fake papers, fake news

వాషింగ్టన్‌, జనవరి 18: అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన పదవికి రాజీనామా చేశారని వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. దాంతో అమెరికా ప్రజలు ఆశ్చర్యంలో మునిగిపోయారు. అన్‌ప్రెసిడెంటెడ్‌‘ అనే శీర్షికతో 2019, మే 1వ తేదీ పత్రికలో ఈ కధనం ప్రచురితమైంది. ఆ కథనంలో ట్రంప్‌ రాజీనామాతో ప్రపంచదేశాల్లో సంబరాలు అంబరాన్ని అంటాయని వెల్లడించారు. ఈ పత్రికను కొందరు వాషింగ్టన్‌తో పాటు వైట్‌హౌస్‌ సమీపంలో ఉచితంగా పంచిపెట్టారు. చివరికి పత్రికలోని తేదీని గమనించి అది నకిలీ ఎడిషన్‌ అని భావించారు.

అయితే ఈ విషయంపై వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక స్పందిస్తూ.. అది నకిలీ ఎడిషన్‌ అనీ, దానితో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. ట్రంప్‌ 2019, ఏప్రిల్‌ 30న వైట్‌హౌస్‌ను వదిలివెళ్లిపోయినట్లు ఆ నకిలీ ఎడిషన్‌లో లీసా చుంగ్‌ పేరుతో కథనం ప్రచురితమైంది. ‘రాజీనామా విషయంలో ట్రంప్‌ అధికారిక ప్రకటనను వెలువరించలేదు. 2019, ఏప్రిల్‌ 30న ఓవల్‌ కార్యాలయంలోని అధ్యక్షుడి డెస్క్‌ పక్కన ఓ న్యాప్‌కిన్‌ దొరికినట్లు నలుగురు వైట్‌హౌస్‌ అధికారులు తెలిపారు. అందులో ఎరుపురంగు ఇంక్‌తో ‘తన రాజీనామాకు నిజాయితీ లేని హిల్లరీ క్లింటన్‌ను, హైఫియర్‌ను, నకిలీ వార్తల మీడియాను నిందించండి అని ట్రంప్‌ రాసినట్లు ఉంది. ప్రస్తుతం ఆయన శ్వేతసౌధం వదిలేసి రష్యాలోని క్రిమియాలో ఉన్న యాల్టా రిసార్ట్‌కు వెళ్లిపోయారు. దీంతో ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ అమెరికా అధ్యక్షుడిగా వెంటనే ప్రమాణస్వీకారం చేశారు అని కథనం ప్రచురితమైంది. ఈ నకిలీ ఎడిషన్‌ ను, వెబ్‌సైట్‌ను ‘యస్‌ మెన్‌ అనే గ్రూపు నడుపుతోందని అమెరికా జర్నలిస్ట్‌ రామ్సే చెప్పారు.