జైట్లీ ఆరోగ్యంపై రాహుల్ ట్వీట్..

SMTV Desk 2019-01-17 15:13:35  Arun Jaitley, Rahul Gandhi, health, tweet

న్యూఢిల్లీ, జనవరి 17: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన చికిత్స నిమిత్తం విదేశాలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. అరుణ్‌ జైట్లీ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్‌ చేశారు. అరుణ్‌ జైట్లీ అకస్మాత్తుగా అమెరికా వెళ్లారు. గత ఏడాది ఢిల్లీలోని ఎయిమ్స్‌లో జైట్లీకి మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ అనంతరం విదేశాల్లో ఆయన చికిత్స పొందడం ఇదే ప్రథమం.

ఈ సందర్బంగా రాహుల్ తన ట్విట్టర్ ఖాతాలో ‘జైట్లీ జీ మేము ప్రతిరోజు మీ విధానాలతో విభేదిస్తుంటాము. కానీ మీ అనారోగ్యం వార్త మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. మీరు త్వరగా కోలుకోవాలని నేను, మా పార్టీ నాయకులందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి సమయంలో మీకు, మీ కుటుంబ సభ్యులకు 100 శాతం తోడుగా ఉంటాం అని ట్వీట్‌ చేశారు. అరుణ్‌ జైట్లీ త్వరలోనే తిరిగి వస్తారని.. అందువల్ల ఆర్థిక శాఖ బాధ్యతలను ఎవరికి అప్పగించడం లేదని తెలిసింది. మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టే నాటికి జైట్లీ ఇక్కడ ఉంటారని తెలిసింది.