వైఎస్‌ షర్మిల ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు

SMTV Desk 2019-01-15 13:05:43  Sharmila, YSRCP, HYD police

హైదరాబాద్, జనవరి 15:సోషల్‌మీడియాలో తనపై, తన కుటుంబ సభ్యులపై అభ్యంతరకర​ వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్‌ షర్మిల ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం షర్మిల, భర్త అనిల్‌ కుమార్‌తో కలిసి కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లారు. వీరితో పాటూ కమిషనర్‌ను కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వాసిరెడ్డి పద్మ ఉన్నారు.

‘2014 ఎన్నికలకు ముందు ఎప్పుడో మొదలు పెట్టి, నాకు సినీ హీరో ప్రభాస్‌కు సంబంధం ఉంది అని ఓ వర్గం ఆన్‌లైన్‌లో దుష్ప్రచారాన్ని చేసింది. ఎన్నికల తరువాత దీనిపై ఫిర్యాదు కూడా చేశాము. పోలీసుల విచారణ అనంతరం, చర్యలు తీసుకోవడంతో కొంత కాలం ఈ దుష్ప్రచారం ఆగింది. కానీ మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి, కనుక ఈ విషప్రచారానికి మళ్లీ వేగం పెంచారు. వీరి ఉద్దేశం వొక్కటే నా వ్యక్తిత్వాన్ని హననం చేయడం. ఈ ప్రచారాలను సృష్టిస్తున్నవారిమీద, వారి వెనకున్న వారి మీద చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను కలిశాము.

సోషల్‌ మీడియాలో తనపై, తన కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్‌ షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్‌ పోలీసులు స్పందించారు. ఫిర్యాదును సైబర్‌ క్రైమ్‌ విభాగానికి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ బదిలీ చేయడంతో సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న గుర్తుతెలియని వ్యక్తులపై సెక్షన్ 67 ఐటీ యాక్ట్‌ 2000 (ఏ ఎలక్ట్రానిక్ పరికకరాల ద్వారానైనా అసత్యాలను ప్రచారం చేయడం), ఐపీసీ సెక్షన్‌ 509 (మహిళలను కించపరచడం) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదనపు డీసీపీ రఘువీర్ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగనుంది. ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.