ఈఎన్‌టి ఆసుపత్రిలో పెరిగిన రోగుల సంఖ్య

SMTV Desk 2019-01-14 15:37:08  ENT Government hospital, Hyderabad, Winter weather, Cold temperature

హైదరాబాద్, జనవరి 14: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవడంతో వృద్దులు, చిన్నారులు ఆసుపత్రి పాలవుతున్నారు. చలి తీవ్రత పెరగడంతో చెవి, ముక్కు, గొంతు ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి అధిక సంఖ్యలో పెరుగుతుంది. కాగా ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అంతేకాక దీనికి తోడూ వాతావరణ కాలుష్యం కూడా ఎక్కువగా పెరగడంతో బ్యాక్టీరియా, వైరస్‌ మరింత బలం పుంజుకుంటున్నాయి. దీంతో హైదరాబాద్‌లోని ఈఎన్‌టి ఆసుపత్రికి చికిత్స కోసం వస్తున్న రోగుల సంఖ్య భారీగా పెరుగుతోంది. సాధారణంగా ఈ ఆసుపత్రికి రోజుకు సగటున 1200 మంది వరకు ఓపి రోగులు వస్తుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 2000 వరకు చేరింది. కాగా, ఆసుపత్రికి భారీగా వస్తున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా కౌంటర్లు లేకపోవడంతో చికిత్స కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తుండటంతో జ్వర పీడితులు, మధుమేహులు, వృద్ధులు సొమ్మసిల్లి పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు, చలి తీవ్రత పెరగడంతో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్నారులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రతకు ఫ్లూ కారక వైరస్‌ మరింత బలపడి వొకరి నుంచి మరొకరికి త్వరగా విస్తరిస్తుంది.

జలుబుతో ముక్కు కారడం, ముక్కు నాళాలు, చెవి గొంతు నాళాలతో వొకదానికొకటి అనుసంధానించబడి ఉండటంతో అవి వొకదాని తరువాత మరొకటి ఇన్ఫెక్షన్లకు గురవుతారు. ముక్కులోని ఇన్ఫెక్షన్‌ చెవికి విస్తరించి చీము కారడం, చెవి పోటు వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. గొంతు బొంగురు పోవడంతో పాటు ట్రాన్సిల్స్‌కు కారణం అవుతుంది. ఇప్పటికే సైనసీటిస్‌తో బాధపడుతున్న వారు చలి తీవ్రతకు ముక్కు మరింత బిగుసుకు పోయి శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. తలనొప్పితో బాధపడుతున్న వీరు చికిత్స కోసం ఆసుపత్రికి పరుగులు తీస్తున్నారు. ఇదిలా ఉండగా, చలి కాలంలో బ్యాక్టీరియా వైరస్‌ మరింత బలపడుతుంటాయనీ, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు చలికాలంలో మరింత ఇబ్బందులకు గురవుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు చలి వాతావరణంలో ఎక్కువ సేపు ఉండకపోవడం, కూల్‌ వాటర్‌, శీతల పానీయాలు తీసుకోక పోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. తరచూ గోరు వెచ్చటి నీరు తీసుకోవడమే కాకుండా పడక గదుల్లో వెచ్చటి వాతావరణం ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. దుమ్ము, ధూళికి దూరంగా ఉండాలనీ, ఇప్పటికే గొంతు బొంగురు పోవడం వంటి సమస్యలు ఉన్నట్లయితే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలని పేర్కొంటున్నారు. ముక్కు కారడం, బిగుసుకు పోవడం, తలనొప్పి, చెవినొప్పి వంటి సమస్యలకు దూరంగా ఉండాలని ఈఎన్‌టీ ఆసుపత్రి వైద్యులు డా.రవిశంకర్‌ సూచించారు.