ఈబీసీ రిజర్వేషన్లను పక్కన బెట్టిన టీఎస్ సర్కార్...???

SMTV Desk 2019-01-14 13:44:38  EBC Reservations, Central government, KCR, Narendramodi, BJP, State government

హైదరాబాద్, జనవరి 14: కేంద్ర సర్కార్ అగ్రవర్ణ పేదల కోసం రిజర్వేషన్ల కోటాను అమలు చేసినప్పటికీ దేశ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పట్లో పట్టించుకునే వాతావరణం కన్పించడం లేదని తెలుస్తోంది. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాతనే ఎకానమికల్లీ బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ రిజర్వేషన్ల అమలుపై బిజెపియేతర రాష్ట్రాలు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే 19 బిజెపి పాలిత రాష్ట్రాల్లో మాత్రం అప్పుడే అమలుకు నడుం బిగిస్తున్నారు. గుజరాత్‌లో అప్పుడే అమలుకు చర్యలు ప్రారంభమయ్యాయి. తెలగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈబీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఇప్పట్లో అమలు చేసేందుకు సన్నద్దం కావడం లేదని తెలుస్తోంది. ముస్లిం,ఎస్టీల రిజర్వేషన్ల పెంపు కోసం కేంద్రంపై అనేకసార్లు వత్తిడి చేసినా పట్టించుకోలేదని, తాజాగా పార్లమెంట్‌ సమావేశాల్లో ఈబీసీ బిల్లు సందర్భంగా టిఆర్‌ఎస్‌ ఎంపీలు లేవనెత్తినా ప్రయోజనం లేకుండా పోయిందని సిఎం కెసిఆర్‌ కోపంతో ఉన్నారు. అందుకనే కేంద్రం హడావుడిగా ఆమోదించిన ఇబీసి రిజర్వేన్ల అంశాన్ని పక్కన పెట్టండి, తర్వాత చూద్దామని అధికారులతో చెప్పారని తెలుస్తోంది.

ఇదే వరుసలో ఆంధ్రప్రదేశ్‌కూడా ఉందని తెలుస్తో ంది. కాపులకు రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రం పట్టించుకోలేదని చంద్రబాబు కూడా కోపంతో ఉన్నారు. వెంటనే ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల ఆ రాష్ట్రాల్లోని బిజెపియేతర ప్రభుత్వాలకు వచ్చే లాభం లేదని భావిస్తున్నారు. అందుకనే పార్లమెంట్‌ ఎన్నికల తర్వాతనే తెలంగాణతో బిజెపియేతర ప్రభుత్వాలు పట్టించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఇబిసిలను నిర్ధారించడం, వారి ఆదాయ పరిమితులను నిర్ధేశించడం కూడా కుదరదు, దానికి ప్రత్యేక అధ్యయనం చేశాకే అమలుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇబీసీలను నిర్ధారించే విషయంలో, ఆదాయ పరిమితుల విషయంలో ఆయా రాష్ట్రాలు సొంతంగానే కసరత్తు చేయాల్సి ఉంటుంది. పార్లమెంట్‌ ఎన్నికలలో లబ్ది పొందే విధంగా బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఈబీసి రిజర్వేషన్ల అమలుకు వెంటనే చర్యలు చేపట్టడం ప్రారంభిస్తున్నాయి.

అగ్ర వర్ణాలకు 10శాతం రిజర్వేషన్లు-నియమ నిబంధనలు :

వార్షిక ఆదాయం రూ. 8లక్షలకు మించరాదు, 5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి ఉండాలి. నివాసం వెయ్యి చదరపు అడుగుల కంటే తక్కువ ఉండాలి. మునిసిపాలిటీ పరిధిలో వుండే నివాస స్థలం అయితే కనుక 109 చదరపు గజాల లోపులో ఉండాలి. మున్సిపాలిటియేతర పరిధిలో అయితే కనుక 200 చదరపు గజాల లోపులో ఉండాలి.