ఆ పార్టీ అయోధ్య వివాదానికి పరిష్కారం కోరుకోవడం లేదు...!!!

SMTV Desk 2019-01-13 15:58:43  Narendra modi, BJP, Congress party, Ram mandir in ayodhya

న్యూ ఢిల్లీ, జనవరి 13: భారత ప్రధాని, బీజేపీ జాతీయాధ్యక్షుడు నరేంద్ర మోడీ జాతీయ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. తమ పార్టీకి వ్యతిరేక కూటమి వొక విఫల ప్రయోగమని, ఆ పార్టీలు అన్నీ బలహీన ప్రభుత్వం ఏర్పాటు చేసి బంధుప్రీతి, అవినీతిని ప్రోత్సహించే కుట్రలుచేస్తుంటే తమ పార్టీ మాత్రం అన్నిరంగాల సర్వతోముఖాభి వృద్ధికి కృషిచేస్తుందని మోడీ పేర్కొన్నారు. అంతేకాక కాంగ్రెస్ అయోధ్య వివాదానికి పరిష్కారం కోరుకోవడం లేదని, తమ న్యాయ వాదుల ద్వారా అడ్డంకులు సృష్టిస్తోందని అన్నారు. బీజేపీ జాతీయ మండలి సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ఎవరైతే కాంగ్రెస్‌ పార్టీని ఆ పార్టీ సంస్కృతిని విమర్శించి ధ్వజమెత్తారో ఇపుడు ఆ పార్టీలే కాంగ్రెస్‌తో చేతులు కలుపుతున్నాయని అన్నారు. పటిష్టమైన సుస్థిర ప్రభుత్వం మనకు కావాలని తద్వారానే అవినీతికి చరమగీతం పాడగలుగుతామని మోడీ వెల్లడించారు.

ఈ రోజుల్లో దేశంలో వొక మహా కూటమి పేరిట విఫల యత్నం జరుగుతున్నదని ఎద్దేవాచేసారు. వారంతా వొక్కటిగా వచ్చి వొక బలహీన ప్రభుత్వాన్ని మాత్రమే ఏర్పాటుచేయ గలుగుతారని, వారికి పటిష్టమైన ప్రభుత్వం అవసరం లేదని, అలా అయితే వారి షాపులు మూసేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మోడీ పేర్కొన్నారు. బిఎస్‌పి సమాజ్‌వాది పార్టీలు లోక్‌సభ ఎన్నికలకు కూటమి పొత్తులను ప్రకటించిన నేపథ్యంలో మోడీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రాజకీయంగా కీలకమైన అతిపెద్ద రాష్ట్రంగా నిలిచిన ఉత్తరప్రదేశ్‌లో గత పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి అత్యంత ఎక్కువ స్థానాలు గెలుచుకున్నదని, 2014 లోక్‌సభ ఎన్నికలకంటే ఇపుడు ఎక్కువస్థానాలు గెలుచుకునే లక్ష్యంతో పార్టీ తన వ్యూహాలను అమలుచేస్తుందని ప్రధాని వెల్లడించారు.

ప్రతిపక్షాలకు బలహీనప్రభుత్వం ఉంటేనే మేలని భావిస్తాయని, సుస్థిర ప్రభుత్వం అయితే వారి అవినీతికి అడ్డుపడుతుందని భావన అని అందు వల్లనే వారు రాజకీయంగా కీలకమైన యుపిలో కూడా పొత్తులకు దిగుతున్నారని పేర్కొన్నారు. ఈ పొత్తులతో వారు తమ సన్నిహితులు, కుటుంబీకులు, బంధువులకు మాత్రమే మేలు చేసుకోగలుగుతారని అన్నారు. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుద్వారా సబ్‌కాసాథ్‌, సబ్‌కా వికాస్‌ అన్న నినాదంతో దేశాన్ని మరింత ముందుకు నడిపిం చేది బిజెపి వొక్కటేనని అన్నారు.