బాహుబలి-2 రికార్డు బీట్ చేసిన చరణ్..

SMTV Desk 2019-01-12 12:55:15  Ram Charan, Vinaya Vidheya Rama, Prabas, bahubali, Record break

హైదరాబాద్, జనవరి 12: రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతటి ఘనకీర్తిని తీసుకువచ్చిందో తెలిసిన విషయమే. ప్రతి సినీ ఇండస్ట్రీ.. టాలీవుడ్ వైపు చూసేలా చేసిన చిత్రం ‘బాహుబలి . ఆ సినిమా తరువాత టాలీవుడ్, బాలీవుడ్ లో వచ్చిన చాలా చిత్రాలు దాని రికార్డు బీట్ చేయడానికి ప్రయత్నిస్తున్న తీరుపై కూడా ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. తాజాగా అమితాబ్, ఆమీర్ కలిసి నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ చిత్రం.. బాహుబలి2 చిత్రాన్ని అలవోకగా రీచ్ అవుతుందని అంతా భావించారు. కానీ అది బాక్సాఫీస్ వద్ద దారుణంగా చతికిలపడింది. అయితే నిన్న విడుదలైన రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ చిత్రం బాహుబలి2 ను బీట్ చేసిందంటూ వార్తలు వచ్చాయి. అయితే అది ఓవరాల్‌గా కాదు.. కేవలం సీడెడ్ ఏరియా వరకు మాత్రమే.

బాహుబలి 2 సినిమా విడుదలైన తోలి రోజు సీడెడ్ ఏరియాలో రూ.6.20 కోట్ల షేర్ సాధించగా, చరణ్ వినయ విధేయ రామ రూ.7.15 కోట్ల షేర్‌తో ఆల్‌టైమ్ రికార్డును సాధించినట్లుగా ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. సినిమా విడుదలైన మొదటి ఆట నుంచే నెగిటివ్‌ టాక్ వచ్చినా.. కలెక్షన్ల విషయంలో మాత్రం చరణ్ దుమ్మురేపుతున్నాడంటూ.. మెగాభిమానులు సోషల్ మీడియాలో ఇప్పటికే కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.