తెలంగాణలో టీ కాంగ్రెస్ ఎక్కడ...???

SMTV Desk 2019-01-11 20:44:02  Telangana assembly elections, Telangana congress party, Panchayat elections, TRS, Uttam kumar reddy

హైదరాబాద్, జనవరి 11: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస పై ఘోరంగా ఓటమి పాలైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోనట్ట్లుగా కనిపిస్తుంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు ఏకగ్రీవ పంచాయతీల కోసం కృషిచేస్తుంటే కాంగ్రెస్‌ నేతలు ఇప్పటి వరకు పల్లెల్లో అడుగుపెట్టలేదు. మొదటిదఫా ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయడానికి ఉత్సాహం చూపెడుతున్నా నేతల సహకారం లేకపోవడంతో క్యాడర్‌ గ్రామ పంచాయతీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టు ద్వితీయశ్రేణి నాయకులు పేర్కొంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో నేతలు అవమానభారంతో గ్రామాల్లోకి రాలేని పరిస్థితి ఉన్నదని పేర్కొంటున్నారు. అసెంబ్లీ పోరు ముగిసిన వెంటనే వచ్చిన పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ నేతలు ముఖం చాటేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలెవరూ గ్రామాల వైపు చూడటం లేదు. పార్టీ నాయకులెవరూ పట్టించుకోకపోవడంతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు పంచాయతీ ఎన్నికల్లో పోటీచేయడానికి వెనుకంజ వేస్తున్నారు. పెద్దపెద్ద నేతలే ఓడిపోయారు.. మేమెంతా అంటూ ఉసూరుమంటున్నారు.

ఇదిలాఉండగా, పంచాయతీ సమరం సమయంలోనే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విదేశీటూర్లకు వెళ్లడంతో పార్టీ వ్యవహారాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. యూరప్‌ వెళ్లిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పంచాయతీ ఎన్నికలను గాలికొదిలేశారని పార్టీ నేతలు పెదవి విరుస్తున్నారు. ఓటమి నుంచి తేరుకుని, గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఈ ఎన్నికలను ఉపయోగించుకోవాల్సి ఉండగా నేతలంతా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ద్వితీయశ్రేణి నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. విదేశీ టూర్లపై ఉన్న మోజు పార్టీ పటిష్ఠతపై లేకుండాపోయిందని తప్పుపడుతున్నారు.