మైలవరం 'జన్మభూమి-మాఊరు' కార్యక్రమంలో గందరగోళం...

SMTV Desk 2019-01-11 20:19:09  TDP, Janmabhoomi ma ooru, Mailavaram, YSRCP, Devineni uma maheshwarao

కృష్ణా, జనవరి 11: జిల్లాలోని మైలవరం మండల కేంద్రంలో ఈ రోజు జరిగిన జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో పెద్ద గందరగోళం ఏర్పడింది. ఈ కార్యక్రామానికి మంత్రి దేవినేని ఉమా ఉమామహేశ్వర రావు విచ్చేసిన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే వైఎస్సార్ సిపి నాయకులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ భారీ ఎత్తున కార్యకర్తలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, వైఎస్సార్ సిపి కార్యకర్తల మధ్య తోపులాట జరిగి గందరగోళం నెలకొంది. పోలీసుల కళ్లుగప్పి జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తున్న మండల పరిషత్తు కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు కృష్ణ ప్రసాద్ ప్రయత్నించారు. ఆయనతో పాటు కొందరు వైసిపి నాయకులు, కార్యకర్తలు కార్యాలయం వెనుకవైపు నుండి గోడ దూకి ఆవరణలోకి ప్రవేశించారు. దీన్ని గుర్తించిన పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుండి బయటకు తరలించారు. ఈ క్రమంలోనే పోలీసులకు, వైసిపి నాయకులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు వైసిపి నాయకులపై దాడికి పాల్పడ్డారు.





పోలీసుల తీరుకు నిరసనగా కృష్ణ ప్రసాద్ మైలవరం మెయిన్ రోడ్ మీద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పురగుట్ట ఇళ్ళ పట్టాలు పంపిణీ పేరుతో మంత్రి దేవినేనీ ఉమ అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. నిజంగా మంత్రి దేవినేని ఉమకు పేదల సంక్షేమం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పేదలను మోసం చేసేందుకు జవాబు పత్రం పేరుతో పేపర్లు పంపిణీ ఎందుకని ప్రశ్నించారు. మంత్రి దేవినేనీ ఉమా చేస్తున్న తప్పుడుపనులు గురించి జన్మభూమి నోడల్ అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న తనను, కార్యకర్తలనే కాదు...పాత్రికేయులపై కూడా పోలీసులు దాడులకు పాల్పడ్డారని కృష్ణ ప్రసాద్ మండిపడ్డారు. ఇలా రోడ్డుపై ధర్నా నిర్వహిస్తున్న వైసిపి నాయకులకు పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మంత్రి దేవినేని ఉమ జన్మభూమి కార్యక్రమంలోముగించుకుని తిరిగి వెళ్లిన తర్వాత వీరందరికి స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు.