భాజపాతో పొత్తు ప్రసక్తే లేదు: స్టాలిన్‌

SMTV Desk 2019-01-11 19:29:03  MK Stalin, tamilnadu, DMK, Narendra Modi

చెన్నై, జనవరి 11: జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని డీఎంకే చీఫ్‌ ఎంకే స్టాలిన్‌ స్పష్టం చేసారు. ‘‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనను తాను వాజ్‌పేయీతో పోల్చుకోవడం నిజంగా హాస్యాస్పదం. ఆయన ఎప్పటికీ వాజ్‌పేయీ కాలేరు. ఆయన లాంటి రాజకీయాలు మోదీ ఎప్పటికి చెయ్యలేరు అని స్టాలిన్‌ విమర్శించారు. తమిళనాడు బీజేపీ నేతలతో మోదీ నిన్న వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ.. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలతో పొత్తుకు బీజేపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటుందని అన్నారు. మోదీ వ్యాఖ్యలపై స్టాలిన్‌ స్పందిస్తూ.. బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదన్నారు.

గతంలో డీఎంకే, బీజేపీ పొత్తు పెట్టుకున్న మాట వాస్తవమేనని, కానీ వాజ్‌పేయీ లాంటి నిర్ణయాత్మక రాజకీయాలు మోదీ చెయ్యలేరని స్టాలిన్‌ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు చెన్నైలో శుక్రవారం జరిగిన పార్టీ సమావేశంలో స్టాలిన్‌ చెప్పారు. వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న సమయంలో ప్రాంతీయ పార్టీలకు కలుపుకుని పోయారని, కానీ ఇప్పుడు బీజేపీలో అలాంటి నాయకత్వం లేదని స్టాలిన్‌ అన్నారు. కాగా 1999 ఎన్నికల్లో బీజేపీ,డీఎంకే కూటమిగా ఏర్పడ్డ విషయం తెలిసిందే.