రాష్ట్ర ప్రజలకు బాబు సంక్రాంతి కానుక

SMTV Desk 2019-01-11 17:37:31  Chandrababu, Pensions, AP, TDP, Janmabhomi maa ooru, Nellore

అమరావతి, జనవరి 11: శుక్రవారం నెల్లూరులో జరిగిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి కానుకగా ఆ రాష్ట్ర ప్రజలకు పెన్షన్ ను రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ప్రతి నెల వెయ్యి రూపాయాల పెన్షన్‌ను రూ.2వేలకు పెంచుతున్నట్టుగా ప్రకటించారు. అంతేకాక పది రకాల పెన్షన్ లబ్దిదారులకు రెట్టింపు చేస్తున్నట్టు సర్కార్ నిర్ణయం తీసుకొంది. ప్రస్తుతం వృద్దాప్య పెన్షన్లను వెయ్యి నుండి రెండు వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. జనవరి మాసానికి చెందిన పెన్షన్‌ను ఫిబ్రవరి మాసంలో ప్రతి వొక్క లబ్దిదారుడికి రూ.3 వేలను ఇవ్వనున్నట్టు చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఫిబ్రవరి నెల నుండి ప్రతి నెల రూ. 2వేలను పెన్షన్ గా ఇవ్వనున్నట్టు చెప్పారు.

ప్రస్తుతం 51 లక్షల మంది పెన్షన్ లబ్దిదారులు రాష్ట్రంలో ఉన్నారు. దివ్యాంగులు, హిజ్రాలకు ఇస్తున్న పెన్షన్‌ను వెయ్యి నుండి రూ.1500లకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. జన్మభూమి సభల్లో సుమారు లక్షన్నర వరకు కొత్తగా పెన్షన్ కోసం ధరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. పెన్షన్ పెంచుతూ ఏపీ సర్కార్ తీసుకొన్న నిర్ణయం వల్ల ప్రతి ఏటా పదమూడున్నర లక్షల కోట్లు ఖర్చు కానుంది.