మంత్రి గంటాపై గవర్నర్ ఫైర్..???

SMTV Desk 2019-01-10 19:10:44  Narasimhan, Telugu states governer, Narashimhan attend andhra university celebrations, Director of delhi IIT Acharya ram gopal rao, Andhra university VC Nageshwara rao

విశాఖపట్నం, జనవరి 10: బుధవారం జరిగిన ఆంధ్ర యూనివర్సిటీ 85, 86వ స్నాతకోత్సవ వేడుకల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో పాటు మంత్రి గంటా శ్రీనివాస రావు కూడా హాజరయ్యారు. అయితే ఈ వేడుక సందర్భంగా మంత్రి గంటా ప్రభుత్వ వర్శిటీలు ప్రైవేట్ వర్శిటీలతో పోటీపడాలని చేసిన వాఖ్యలపై గవర్నర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలు నేరపూరితం అంటూ విరుచుకుపడ్డారు. అయితే మంత్రి గంటా మాట్లాడుతూ విద్యారంగానికి ఏటా రూ.25 వేల కోట్లు వెచ్చిస్తూ రాష్ట్రంలో విజ్ఞాన సమాజాన్ని నిర్మించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి ప్రముఖ ప్రైవేటు విశ్వవిద్యాలయాలు వస్తున్నాయని గుర్తు చేశారు. ప్రైవేట్ వర్శిటీలతో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు పోటీ పడాలని సూచించారు. దీనికి గవర్నర్ స్పందిస్తూ ప్రైవేటు యూనివర్సిటీలతో ప్రభుత్వ యూనివర్సిటీలు పోటీ పడాలని మంత్రి వ్యాఖ్యానించడం సరికాదన్నారు. అది నేరమంటూ వ్యాఖ్యానించారు.

అంతేకాక ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయొద్దని కోరారు. పీహెచ్‌డీలను డిగ్రీ తరహాలో మార్చేశారని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. విశ్వవిద్యాలయాల్లో పలు నియామకాలకు, పదోన్నతులకు పీహెచ్‌డీ చేసి ఉండాలన్న నిబంధన విధిస్తుండడంతో చాలా మంది ఇష్టం వచ్చినట్లు పీహెచ్‌డీలు చేస్తున్నారని వాపోయారు. ఎంతమంది పరిశోధనలు నాణ్యంగా ఉంటున్నాయి? ఎన్ని పరిశోధనలు సమాజానికి ఉపయుక్తంగా ఉంటున్నాయి? వొక ఆచార్యుడు ఎంతోమందితో పీహెచ్‌డీలు చేయిస్తున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది? ఈ అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చెయ్యాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత కాలంలో బీఏ, బీకాంల మాదిరిగానే పీహెచ్‌డీలు కూడా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు గవర్నర్ నరసింహన్. ప్రస్తుత విద్యావ్యవస్థలో కట్‌, కాపీ, పేస్ట్‌ సంస్కృతి ఎక్కువగా ఉంటోందన్నారు ఈ అంశాలపై దేశవ్యాప్తంగా సమీక్ష జరగాలి అని గవర్నర్‌ నరసింహన్ వ్యాఖ్యానించారు. మరోవైపు విశాఖపట్నం వైద్య రంగంలో ప్రైవేటు ఆసుపత్రులకు ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వీర్యం అయ్యాయని గవర్నర్ ఆరోపించారు. విద్యారంగంలో అలాంటి పరిస్థితి రానీయొద్దని నరసింహన్ కోరారు. వంద శాతానికి దగ్గరగా అత్యధిక మార్కులు వచ్చిన వారికే వివిధ సంస్థల్లో ప్రవేశాలు దక్కుతుండడంతో విద్యార్థులు యంత్రాల్లా మారాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

ఇటీవలి కాలంలో కృత్రిమ మేధే గొప్పదన్న ప్రచారం జరుగుతోందని, కృత్రిమ మేధ మానవీయత ప్రదర్శించగలదా? అని గవర్నర్ ప్రశ్నించారు. అనంతరం 546 మందికి డాక్టరేట్‌లు, ఆరుగురికి ఎంఫిల్‌ డిగ్రీలు, వివిధ అంశాల్లో ప్రతిభ చూపిన 573 మందికి పతకాలను ప్రదానం చేశారు గవర్నర్ నరసింహన్. ఆచార్య రామ్‌గోపాల్‌రావుకు గౌరవ డాక్టరేట్‌ను అందజేశారు. అయితే స్టేజ్ పై ఉండగానే మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యలను గవర్నర్ ఖండించడం చర్చనీయాంశంగా మారింది.