టీడీపీకి షాక్...జనసేనలోకి ఆంధ్రప్రదేశ్ మంత్రి...???

SMTV Desk 2019-01-10 18:00:12  TDP, Janasena, Bhooma akhila priya reddy, YSRCP

కర్నూల్, జనవరి 10: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి భూమ అఖిల ప్రియ రెడ్డి టీడీపీని వొదిలి జనసేన లోకి వెల్లనుందా అని రాజకీయాల్లో వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి. అంతేకాక జనసేన కూడా అఖిల ప్రియను తమ పార్టీలో చేర్చుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోందని ప్రచారం జోరుగా సాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాల, ఆళ్లగడ్డ నుండి భూమా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియలు వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియలు వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరారు. భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించడంతో భూమా అఖిలప్రియను చంద్రబాబునాయుడు తన మంత్రివర్గంలోకి తీసుకొన్నారు. చంద్రబాబునాయుడు కేబినెట్‌లో అఖిలప్రియ పర్యాటక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత జరిగిన ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మనందరెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. అయితే వచ్చే ఎన్నికల కోసం చంద్రబాబునాయుడు అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు నిర్వహిస్తున్నారు.

సంక్రాంతి తర్వాత చంద్రబాబునాయుడు తొలి జాబితాను విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఈ నెల 17వ తేదీన చంద్రబాబునాయుడు అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారని టీడీపీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. కర్నూల్ జిల్లాలోని ఆళ్లగడ్డ, నంద్యాల స్థానాల్లో ఏదో వొక్క స్థానమే వచ్చే ఎన్నికల్లో భూమా కుటుంబానికి కట్టబెట్టే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా టీడీపీ నాయకత్వం నుండి స్పష్టత రావాల్సి ఉంది. నంద్యాల టిక్కెట్టును ఆశిస్తున్న కొందరు నేతలు ఈ స్థానం తమకే ఇస్తానని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారని చెబుతున్నారు. నంద్యాల అసెంబ్లీ సీటు కోసం నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి పట్టుబడుతున్నారు. ఈ స్థానం నుండి తన అల్లుడు శ్రీధర్ రెడ్డిని బరిలోకి దింపాలని ఆయన భావిస్తున్నారు. నంద్యాల, ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానాల్లో ఏదో వొక్క స్థానమే భూమా కుటుంబానికి ఇవ్వనున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే తామంటే గిట్టనివాళ్లే ఈ రకమైన ప్రచారం చేస్తున్నారని భూమా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు ఎన్ఎండీ ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవి కూడ ఇచ్చారు. ఎస్పీవైరెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో నంద్యాల సీటును ఇస్తామని బాబు గతంలోనే హామీ ఇచ్చారని ఎస్పీవై రెడ్డి వర్గీయులు గుర్తు చేస్తున్నారు.

ఆళ్లగడ్డ నుండి భూమా కుటుంబంలో ఎవరో వొకరికి మాత్రమే టిక్కెట్టు ఇవ్వనున్నట్టు బాబు స్పష్టం చేశారనే ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలోనే జనసేన నేతలు భూమా అఖిలప్రియతో చర్చలు జరిపారనే ప్రచారం సాగుతోంది. అఖిలప్రియ ఇటీవల వివాహం చేసుకొన్న భార్గవ్ కాపు సామాజిక వర్గానికి చెందినవాడు. ఈ ప్రాంతంలో కూడ కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగానే ఉంటారు. 2009 ఎన్నికల సమయంలో పీఆర్పీ తరపున ఆళ్లగడ్డ నుండి పోటీ చేసిన భూమా శోభానాగిరెడ్డి విజయం సాధించారు. నంద్యాల నుండి ఎంపీగా పోటీ చేసిన నాగిరెడ్డి ఓటమి పాలయ్యారు. పీఆర్పీలో భూమా నాగిరెడ్డి కటుంబం ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్‌తో మంచి సంబంధాలు ఉండేవి. ఈ సంబంధాల కారణంగానే నంద్యాల ఉప ఎన్నికల సమయంలో కూడ పవన్ కళ్యాణ్‌ తమకు మద్దతిస్తారని కూడ చెప్పారు. కానీ, ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏ పార్టీకి మద్దతివ్వకుండా తటస్థంగా ఉన్నారు. ఆళ్లగడ్డ టిక్కెట్టును టీడీపీలోని ఏవీ సుబ్బారెడ్డి కూడ కోరుతున్నారు. ఆళ్లగడ్డలో పోలీసులు తమ అనుచరుల ఇళ్లలో సోదాలు నిర్వహించడంపై నిరసనగా మంత్రి అఖిలప్రియ గన్‌మెన్లను తిప్పి పంపారు. అఖిలప్రియకు కూడ మద్దతుగా భూమా బ్రహ్మనందరెడ్డి కూడ తన గన్‌మెన్లను తిప్పి పంపారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే జనసేన నేతలు భూమా అఖిలప్రియతో టచ్‌లోకి వెళ్లినట్టు చెబుతున్నారు. అయితే ఈ విషయమై భూమా అఖిలప్రియ నుండి స్పష్టత రాలేదు. మరో వైపు భూమా కుటుంబంపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అనుచరులు కొట్టిపారేస్తున్నారు. గిట్టనివాళ్లు తమ లబ్ది కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.