ఈబీసీ రిజర్వేషన్లు మంచి కోసం అయితే స్వాగతిస్తాం : టీడీపీ

SMTV Desk 2019-01-09 17:03:19  Chandrabaabu about EBC Reservations, AP CM Fires on central government

అమరావతి, జనవరి 9: భారత ప్రధాని నరేంద్రమోడి ఆమోదించిన రిజర్వేషన్ల బిల్లుపై మరోసారి ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. దేశంలో సంఘ్ పరివార్ కుట్రలకు కేంద్రంగా మారిందని ఆర్ఎస్ఎస్ కుట్రలను బీజేపీ అమలు చేస్తోందని మండిపడ్డారు. ఈబీసీ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలపడం బుధవారం రాజ్యసభ ముందుకు రానున్న నేపథ్యంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈబీసీ రిజర్వేషన్లు మంచి కోసం అయితే స్వాగతిస్తానని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఇప్పటి వరకు సామాజిక వెనుకబాటు తనం రిజర్వేషన్లు మాత్రమే ఉన్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు గండికొడతామంటే తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు.

ఈబీసీ బిల్లు రాజకీయ కుట్రలో భాగమని ఆయన విమర్శించారు. బీజేపీ కుట్ర కోణాలపై ప్రజలు తెలుగుదేశం పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో సామాజిక పరిస్థితులకు అనుగుణంగా కాపు రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే ఇప్పటి వరకు స్పందించలేదని చంద్రబాబు మండిపడ్డారు. కాపు రిజర్వేషన్లతోపాటు బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని అయితే కేంద్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వాల్మీకి బోయలను ఎస్టీలో చేరక్చడంపై ప్రశ్నించాలని పార్టీ రాజ్యసభ సభ్యులకు సూచించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ రెండు అంశాలపై ఎంపీలు కేంద్రాన్ని పార్లమెంట్ లో నిలదియ్యాలని టెలికాన్ఫరెన్స్ లో దిశానిర్దేశం చేశారు.

మరోవైపు పార్టీలోని గ్రూపు రాజకీయాలపై చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఇష్టం వచ్చినట్లు వ్యహరిస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. కూర్చున్న కొమ్మనే నరుక్కోవడం మూర్ఖత్వం అంటూ విరుచుకుపడ్డారు. ఇకనైనా గ్రూపు విబేధాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు.