స్టెరిలైట్‌ ఫ్యాక్టరీని మళ్లీ తెరవాల్సిందే : సుప్రీంకోర్టు

SMTV Desk 2019-01-08 18:55:35  Supreme court of India, Sterlite, National Green Tribunal, tamilnadu government, Vedanta group

న్యూఢిల్లీ, జనవరి 8: తమిళనాడులోని తూత్తుకుడి రాగి పరిశ్రమను తిరిగి ప్రారంభించడాన్ని అడ్డుకోవాలని నమోదైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. తూత్తుకుడిలో ఉన్న ‘స్టెరిలైట్‌ రాగి ప్లాంట్‌ను శాశ్వతంగా మూసేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదేశాలు జారీ చేయగా.. వేదాంత గ్రూప్‌ జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఎన్జీటీ పళనిస్వామి ప్రభుత్వ ఆదేశాలను తప్పుబట్టింది. మళ్లీ స్టెరిలైట్‌ కర్మాగారాన్ని తెరువాలంటూ గత డిసెంబర్‌ 15 ఆదేశాలు ఇచ్చింది. కంపెనీ లైసెన్స్‌ను పునరుద్ధరించాలని, మూడు వారాల్లో కర్మాగారాన్ని పునఃప్రారంభించేందుకు వీలుగా అనుమతులన్నీ జారీచేయాలని తమిళనాడు కాలుష్య నియంత్రణ సంస్థకు గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు జారీచేసింది.

కాగా ఎన్జీటీ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించడంతో పర్యావరణ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న ఈ కంపెనీని మూసివేయాలంటూ నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేయగా.. పోలీసులు కాల్పులు జరపడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.