వైరంతో మొదలు కానున్న తెదేపా సీట్ల సర్దుబాట్లు..???

SMTV Desk 2019-01-08 13:57:27  TDP, Jammalamadugu constituency, Adi narayana reddy, Rama subbareddy

అమరావతి, జనవరి 8: ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెదేపాలో టికెట్ల కోసం అనేక మంది ఆశావాహులు ఎదుటు చూస్తున్నారు. కాగా దశాబ్దాల వైరంతో, వొకే పార్టీలో ఉన్న నట్లు వొకే నియోజకవర్గం కోసం ఘర్షణకు సిద్దమవుతున్నారు. వీటిలో కడప జిల్లా జమ్మల మడుగు నియోజకవర్గంపైనే ఇప్పుడు అందరి చూపు నెలకొంది. ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డాగా ఉన్న జమ్మలమడుగులో రెండు కుటుంబాలదే ఆధిపత్యం. వాటిలో వొకటి పొన్నపురెడ్డి, రెండవది దేవగుడి కుటుంబం. ఈ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శతృత్వం ఉంది. అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు రెండు గ్రూపులు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి తర్వాత టీడీపీలో చేరి, మంత్రయ్యారు.





ఆయన మరోసారి ఇక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి చేతిలో ఓడిపోయి ఎమ్మెల్సీగా ఉన్న రామసుబ్బారెడ్డి అసెంబ్లీ సీటు కావాల్సిందేనని పట్టుబట్టారు. అసెంబ్లీకి పోటీ చేయకపోతే ఏళ్లుగా తమ కుటుంబాన్ని నమ్ముకున్న కార్యకర్తలు ఇబ్బందిపడతారని రామసుబ్బారెడ్డి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆదినారాయణ రెడ్డిని కడప పార్లమెంటు బరిలో దించుతారని ప్రచారం జరుగుతుండటంతో తాను అసెంబ్లీకే పోటీ చేస్తానని ఆది చెప్పడంతో టీడీపీ అధినేత ఎటూ తేల్చుకోలేకపోయారు. నిన్న అమరావతిలో ఇద్దరి నేతలతో అర్థరాత్రి వరకు చర్చలు జరిపిన ఆయన తన నిర్ణయాన్ని అతి త్వరలో ప్రకటిస్తానని తెలిపారు.