టీడీపీ ఎంపి శివప్రసాద్ సస్పెండ్...!!

SMTV Desk 2019-01-07 16:39:12  TDP, MP, Shiva prasad, Loksabha, Suspended, Sumitra mahajan

అమరావతి, జనవరి 7: టీడీపీ ఎంపి శివప్రసాద్ ను లోక్ సభ నుండి రెండు రోజుల పాటు సస్పెండ్ చేశామని స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రకటించారు. ఎంజీఆన్ వేషధారణలో లోక్ సభ కు వచ్చిన ఆయన ఏపికి న్యాయం చేయాలంటూ సభలో నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ ఆయన్ని ఎంత సముదాయించిన వినకుండా వెల్ లోకి దూసుకొచ్చి సభా కార్యకలాపాలకు అడ్డుతగిలారు. దీంతో ఆయన్ను సస్పెండ్ చేశారు. అంతేకాక శివప్రసాద్ తో పాటు అన్నాడీఎంకే పార్టీకి చెందిన మరో ముగ్గురు ఎంపీలపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. కావేరి జలాల విషయంలో లోక్ సభలో నిరసన వ్యక్తం చేస్తూ వెల్ లోకి దూసుకువచ్చినందుకు వారిపై వేటు పడింది. ఇలా ఇవాళ మొత్తం నలుగురు ఎంపీలు లోక్ సభ నుండి రెండు రోజుల పాటు సస్పెన్షన్ కు గురయ్యారు.

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చాలని టిడిపి ఎంపీలు, కావేరి జలాల విషయంలో అన్నాడీఎంకే పార్టీ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీరు సభ ప్రారంభం కాగానే వెల్ లోకి వచ్చి ఆందోళ చేపడుతూ సభా కార్యక్రమాలకు ఆటంకం కల్గిస్తున్నారు. ఇలాగే గత గురువారం కూడా ఇలాగే ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేస్తూ సభలో గందగోళం సృష్టించారు. దీంతో 14 మంది టిడిపి ఎంపిలు, 9మంది అన్నాడీఎంకే ఎంపీలను నాలుగు రోజుల పాటు సస్పెండ్ చేస్తూ సుమిత్రా మహజన్ నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా ఇవాళ సభలో నిరసన వ్యక్తం చేసినందుకు మరో టిడిపి ఎంపీ శివప్రసాద్ తో పాటు ముగ్గురు అన్నాడీఎంకే ఎంపీలు సస్పెండయ్యారు. పార్లమెంట్ రూల్‌ నెం.254(ఎ) ప్రకారం సస్పెండ్ చేసినట్లు స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రకటించారు.