ఉత్తర కొరియా కొత్త క్షిపణి అద్భుతం!

SMTV Desk 2017-05-31 19:39:02  north koria,missile test,target america,north koria pressident

సియోల్, మే 31 : అగ్రరాజ్యం అమెరికా ప్రధాన భూభాగాన్ని లక్ష్యంగా చేసుకోగల సామర్థ్యం ఉన్న కొత్త క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంతో ఉత్తర కొరియా సోమవారం వేడుకలు జరుపుకుంది. అవసరమైతే అమెరికా ప్రధాన భూభాగంపై దాడి చేయగలగాలనే లక్ష్యంతోనే ఉత్తర కొరియా ఈ దూరగామి ఉపరితల క్షిపణిని ఆదివారం పరీక్షించింది. ఈ కొత్త క్షిపణికి భారీ అణు వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉందని కూడా ప్రకటించింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆదివారం ప్రత్యక్షంగా ఈ క్షిపణి పరీక్షను పర్యవేక్షించారని అధికార కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కెసిఎన్‌ఎ) తెలిపింది. పరీక్షించడానికి ముందు ఈ క్షిపణిని కిమ్ జోంగ్ ఉన్ తీక్షణంగా పరిశీలించినట్లు అధికార మీడియా విడుదల చేసిన చిత్రాలు వెల్లడించాయి. హ్వాసంగ్-12 అనే ఈ బ్లాక్ క్షిపణి ప్రాతఃకాల సమయంలో నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లిన తరువాత ఆయన ఎంతో ఆనందంతో అధికారులు, ఇతర సిబ్బందితో కరచాలనం చేశారు. ఉత్తర కొరియా తాను చేపట్టిన అణు, క్షిపణి కార్యక్రమాల వల్ల ఐక్యరాజ్య సమితి (ఐరాస) నుంచి అనేక ఆంక్షలను ఎదుర్కొంటున్నది. ఈ కొత్త క్షిపణి తిరిగి సీ ఆఫ్ జపాన్‌లో పడిపోవడానికి ముందు 2,111.5 కిలోమీటర్ల ఎత్తుకు దూసుకెళ్లిందని, 787 కిలోమీటర్లు ప్రయాణించిందని కెసిఎన్‌ఎ తెలిపింది. దీనినిబట్టి ఈ క్షిపణి గరిష్ఠంగా 4,500 కిలోమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ దూరంలో గల లక్ష్యాలను ఛేదించగలుగుతుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఉత్తర కొరియా ఇప్పటివరకు పరీక్షించిన క్షిపణులన్నింటి లోకి ఇదే లాంగెస్ట్ రేంజ్ మిసైల్ అని అమెరికాలోని మిడిల్‌బరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌కు చెందిన జెఫ్రీ లెవిస్ తెలిపారు. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలోని గువాం ద్వీపకల్పంలో గల అమెరికా స్థావరంపై దాడి చేయగల సామర్థ్యం ఉన్న దేశాంతరగామి ఉపరితల క్షిపణిని ప్రదర్శించడానికి ఉత్తర కొరియా ఈ పరీక్ష నిర్వహించినట్టు కనపడుతోందని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ స్పెషలిస్ట్ జాన్ స్కిల్లింగ్ పేర్కొన్నారు. పైగా, ఖండాంతర ఉపరితల క్షిపణి (ఐసిబిఎం)ని అభివృద్ధి చేసే దిశగా ఈ క్షిపణి పరీక్ష గణనీయమైన పురోగతిగా ఉందని వివరించారు. అమెరికాకు అణు వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలిగే క్షిపణిని అభివృద్ధి చేయడానికి గత ఏడాదినుంచి రెండు అణు పరీక్షలను, డజన్ల కొద్ది క్షిపణి పరీక్షలను నిర్వహించింది. అమెరికా సైనికంగా రెచ్చగొట్టే చర్యలకు దిగితే, వాటిని తిప్పికొట్టడానికి ఉత్తర కొరియా సిద్ధంగా ఉందని కెసిఎన్‌ఎ పేర్కొంది.