నాడు ఎన్టీఆర్...నేడు కేసీఆర్...???

SMTV Desk 2019-01-06 14:51:16  Nandamuri tarakaram rao, KCR, TRS, TDP

హైదరబాద్, జనవరి 6: సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ అగ్ర స్థానాన్ని పొందిన మహానుభావుడు నందమూరి తారకరామారావు. ఎన్టీఆర్ గారి తరువాత అనేక మంది రాజకీయ నాయకులూ వొచ్చినా అన్నగారి స్థానాన్ని మాత్రం ఎవ్వరు అధిగమించ లేకపోయారు. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నగారి పిలుపుతో రాజకీయాల్లో ప్రవేశించి మూడు దశాబ్ధాల పాటు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. పరిపాలనలో, సంక్షేమ కార్యక్రమాల్లో కేసీఆర్.. అన్నగారిని ఫాలో అవుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ నెలకొల్పిన రికార్డును చంద్రశేఖర్ రావు బద్దలుకొట్టనున్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రామారావు 31 రోజుల పాటు మంత్రిమండలి లేకుండా పరిపాలన సాగించారు.

తాజాగా ఆ రికార్డును టీఆర్ఎస్ అధినేత బద్ధలుకొట్టబోతున్నారు. గత నెల 13న రెండవసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఇంతవరకూ తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదు. ఎన్టీఆర్ నెలకొల్పిన 31 రోజుల రికార్డు ఈ నెల 12తో ముగుస్తుంది. సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత తన కేబినెట్ విస్తరణ ఉంటుందని చంద్రశేఖర్ రావు సంకేతాలు ఇవ్వడంతో అన్నగారి రికార్డు కనుమరుగు కావడం ఖాయంగా కనిపిస్తోంది.