కేంద్ర సర్కార్ పై కేటీఆర్ నిప్పుల వర్షం

SMTV Desk 2019-01-05 17:57:20  KTR, TRS, BJP, Central government, Mission Kakateeya, Mission bhagherata

హైదరాబాద్, జనవరి 5: టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర సర్కార్ పై తమ దైన రీతిలో మండిపడ్డారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతోపాటు వివిధ ప్రాజెక్టులకు కేంద్రప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుతున్నాయని మిషన్ భగీరథ వంటి కార్యక్రమం ఎంతో మంచి కార్యక్రమమని దాన్ని దేశం అంతా అనుసరించాల్సిన పథకం అని ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో ప్రసంశించినట్లు కేటీఆర్ గుర్తు చేశారు. మిషన్ భగీరథకు కేంద్రప్రభుత్వం అవార్డు ప్రకటించిందని అలాగే వాటర్ మేన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ కూడా ప్రశంసించినట్లు కేటీఆర్ గుర్తు చేశారు. కాకతీయ, భగీరథ ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రశంసిస్తుందే తప్ప నిధులు విడుదల చెయ్యడం లేదని విమర్శించారు. మిషన్ భగీరథలో రూ.19వేల కోట్లు ఇవ్వాలని, వాటితోపాటు ఇతర ప్రాజెక్టులకు సంబంధించి మరో రూ.4వేల కోట్లు మెుత్తం రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేస్తే కేంద్రమంత్రి ఇవ్వలేమని కుండ బద్దలు కొట్టారని చెప్పారు.

భారతీయ జనతాపార్టీకి తెలంగాణలో ఉనికి లేదన్న అక్కసుతో సవతి తల్లి ప్రేమ కనబరుస్తుందని విమర్శించారు. దేశమంతా వొకేలా చూడాల్సిన సోయ కేంద్ర ప్రభుత్వానికి లేకుండా పక్ష పాత వైఖరి ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.3831 కోట్ల రూపాయలు ఇచ్చారని అంటే బీజేపీ ప్రభుత్వాలు ఉన్నచోట వొకలా లేని చోట్ల మరోలా వ్యవహరిస్తారా అంటూ మండిపడ్డారు. మహారాష్ట్రలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టుల్లో 25 శాతం నిధులు కేంద్రమే భరిస్తోందని గుర్తు చేశారు. కేంద్రప్రభుత్వం ఇలా పక్షపాత ధోరణి ప్రదర్శించినందు వల్లే 2018 ఎన్నికల్లో 103 స్థానాల్లో డిపాజిట్ గల్లంతు అయ్యారని గుర్తు చేశారు. బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తూ పోతే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో డిపాజిట్ దక్కించుకోదని హెచ్చరించారు. అలాగే పునర్విభజన చట్టంలోని హామీలు అమలు చెయ్యడంలో కూడా కేంద్రప్రభుత్వం విఫలమైందన్నారు. గత ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం గెలిపించారని అయితే ఇలాగే కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తే అది కూడా దక్కకుండా చేస్తామన్నారు.ఇప్పటికే ముందస్తు ఎన్నికల్లో ఐదు స్థానాల నుంచి వొక స్థానానికి దిగజారిందని ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

తాము ఎన్నో ప్రాజెక్టులను కేంద్రప్రభుత్వం వద్ద ఉంచి వొక్కదానికి అయినా జాతీయ హోదా ఇవ్వాలని కోరామని తెలిపారు. అయితే ఇప్పటికీ కూడా వొక్కదానికి జాతీయ హోదా ఇవ్వకుండా బీజేపీ దాటవేత ధోరణి వ్యహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మర్యాదపూర్వకంగా ప్రధాని నరేంద్రమోదీని కలిశారన్నారు. ఆ సమయంలో తెలంగాణకు పెండింగ్ లో ఉన్న 16 అంశాలను పరిష్కరించాలని కోరారని అయితే ఇప్పటి వరకు వొక్కదానిపైనా స్పందన రాలేదన్నారు. ప్రధాని నరేంద్రమోదీ బీజేపీ పాలిత ప్రాంతాలకే ప్రధాని మంత్రా లేక దేశానికి ప్రధాని మంత్రా అన్నది మోదీయే తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా వివక్ష చూపిస్తే కేంద్రప్రభుత్వం నష్టపోవడమే తప్ప మరోక్కటి ఉండదని కేటీఆర్ హెచ్చరించారు.