కొండా దంపతులకు భద్రత కొనసాగింపు...

SMTV Desk 2019-01-05 17:07:07  Konda murali, Konda surekha, MLC, MLA, High court, Security

హైదరాబాద్, జనవరి 5: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖలకు కేటాయించిన భద్రతను కొనసాగించాలని హైకోర్టు శుక్రవారం పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. కాగా వారు ఈ భద్రతను ఉపసంహరించడానికి కారణాలు ఏమిటో తెలియజేస్తూ కౌంటర్‌ దాఖలు చేయాలని, తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తమకున్న భద్రతను ఉపసంహరించడాన్ని సవాలు చేస్తూ సురేఖ, మురళీలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరపు న్యాయవాది రఘువీర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ వారికి డిసెంబర్‌ 31 నుంచి భద్రతను ఉపసంహరించారని తెలిపారు.

కొండా సురేఖ 1999లో ఎమ్మెల్యేగా గెలుపొందారని, అప్పటి నుంచి మొన్నటి వరకు ఆమెకు భద్రతను కొనసాగిస్తూ వచ్చారని వివరించారు. రాజకీయ ప్రత్యర్థులు, నిషేధిత గ్రూపుల నుంచి పిటిషనర్లకు ప్రాణహాని ఉందన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి బయటకు వచ్చిన వెంటనే ప్రభుత్వం పిటిషనర్ల భద్రతను ఉపసంహరించిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం తరుఫున ప్రత్యేక న్యాయవాది ఎస్‌.శరత్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ, పిటిషనర్లపై క్రిమినల్‌ కేసులున్నాయన్నారు. గతంలో వారు ప్రజాప్రతినిధులుగా ఉన్నందున భద్రతను కల్పించారని, అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కొండా సురేఖ ఓడిపోయారని తెలిపారు.