నన్ను హత్యచేసేందుకు టీడీపీ ప్రయత్నం : బీజేపీ అధ్యక్షుడు

SMTV Desk 2019-01-05 14:02:46  TDP, BJP, Chandrababu, Narendramodi, Party leaders, Guntoor, Kakinada, Kanna lakshmi narayana

గుంటూరు, జనవరి 5: నిన్న ఏపీ సీఎం చంద్రబాబు కాన్వాయిని కాకినాడలో బీజేపీ నేతలు అడ్డుకున్నందుకు నిరసనగా తెదేపా నేతలు ఈ రోజు గుంటూరులో ఆందోళనకు చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీ నారాయణ ఇంటి ఎదుట టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రధాని నరేంద్రమోదీ కి, కన్నా లక్ష్మీ నారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా రంగంలోకి వెంటనే బీజేపీ కార్యకర్తలు కూడా పోటీపోటాగా ఆందోళన చేపట్టారు. మోదీ, కన్నాకి మద్దతుగా నినాదాలు చేశారు. ఇరు పార్టీల నేతల ఆందోళతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అతితే ఇది గమనించిన లక్ష్మి నారాయణ తనను హత్య చేయించడానికి తెలుగు దేశం పార్టీ ప్రయత్నిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. అందుకోసమే టిడిపి నాయకులు, కార్యకర్తలు ధర్నా పేరుతో తన ఇంటి వద్దకు వచ్చారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆదేశాలతోనే ఈ కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

గతంలో బిజెపి జాతీయాధ్యక్షులు అమిత్ షా, వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లపై కూడా ఇలాగే హత్యాయత్నాలు జరిగాయని ఆరోపించారు. అదే మాదిరిగా తనపై కూడా హత్యాప్రయత్నం జరపడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి బహిరంగంగానే బిజెపి నాయకులను పినిష్ చేస్తానంటున్నాడని కన్నా గుర్తు చేశారు. ఈ విషయంపై కేంద్ర హోంశాఖకు పిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది కాబట్టి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దీనిపై దృష్టిపెట్టాలని కన్నా సూచించారు.