రాష్ట్రంలో సిపిఐని అంతం చేసేలా టీఆరెస్ ప్రయత్నాలు...!!!

SMTV Desk 2019-01-04 16:24:01  CPI, TRS, Telangana assembly elections, Nalgonda, Kodada, Butta shivaji,ZPTC, Bollam mllaiah

కోదాడ, జనవరి 4: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ పార్టీ వొక్క సీటు కూడా సాధించలేకపోయి అసెంబ్లీలో తన ప్రాతినిధ్యాన్నే కోల్పోయింది. కాగా నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో స్థానిక సంస్థల్లో సిపిఐకి ప్రాతినిధ్యం ఉంది. అయితే తెరాసా సిపిఐ కి ఉన్న ఆ కాస్త బలాన్ని కూడా తగ్గించి రాష్ట్రంలో సిపిఐ అనే పార్టీ లేకుండా చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకోసం కార్యాచరణను కూడా ప్రారంభించింది. కోదాడ నియోజకర్గ పరిధిలోని చిలుకూరు జడ్పీటిసి స్ధానాన్ని గత స్ధానిక సంస్ధల ఎన్నికల్లో సిపిఐ గెలుచేకుంది. ఆ పార్టీ తరపున పోటీ చేసిన బట్టు శివాజీ జడ్పీటిసి సభ్యుడిగా ఎన్నికయ్యాడు. తాజాగా ఆయన స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ ఘన విజయం సాధించి మొదటిసారి ఎమ్మెల్యేగా మారారు. చివరి నిమిషంలో టీఆర్ఎస్ లో చేరడంతో ఎన్నికలకు ముందు పార్టీని బలోపేతం చేయడానికి అతడికి అవకాశం లభించలేదు. దీంతో ఎమ్మెల్యేగా మారిన తర్వాత టీఆర్ఎస్ పార్టీని నియోజకవర్గ స్థాయిలో తిరుగులేని శక్తిగా మార్చాలని భావిస్తున్నారు. అందులో భాగంగా చిలుకూరు మండలంలో బలమైన నేతగా వున్న శివాజీని పార్టీలో చేర్చుకున్నారు. ఈ చేరిక కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ శివాజీ తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్‌లో చేరడంతో పార్టీ బలం మరింత పెరిగిందన్నారు. ప్రతి వొక్క టీఆర్ఎస్ కార్యకర్త స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించుకోడానికి కష్టపడాలని మల్లయ్య యాదవ్ సూచించారు.